Equipment సామగ్రి అని అర్థం. ధనమని గాదు. మనం పోగు చేసుకొని అనుభవిస్తున్నదే కాబట్టి ఒకవేళ ధనమను కొన్నా అనుకోవచ్చు. ఇదుగో ఇలాటి దైవాసుర సంపదలు రెండూ అంతో ఇంతో వెంట బెట్టుకొనే వచ్చామీ లోకంలోకి మనమంతా.
ఇవి రెండూ ఏమిటో ఎలాటివో వాటి వలితమేమిటో సాంగోపాంగంగా మనకు వర్ణించి చెప్పటానికి వచ్చిందిప్పుడీ దైవాసుర విభాగ యోగం. ఇంతకు ముందు కూడా నవమాధ్యాయంలో సూచన చేసింది వీటి విషయం గీత. రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అని ఒక మాటా - మహాత్మానస్తు మాం పార్థ - దైవీం ప్రకృతి మాశ్రితాః అని ఒక మాటా - రెండింటినీ వేరు చేసి చూపారక్కడ. కాని రెండింటినీ వర్ణించి చెప్పలేదక్కడ. తాసాం విస్తరేణ ప్రదర్శనాయ అభయ మిత్యాది రధ్యాయ ఆరభ్యతే. ప్రస్తుతం వాటినిక్కడ సవిస్తరంగా బోధించటానికే ఈ అధ్యాయ మారంభ మవుతున్న దంటారు భాష్యకారులు.
అయితే రెండింటినీ బోధిస్తున్నదంటే రెండూ మంచివే అలవరుచుకోమని చెప్పటానికి కాదు. తత్ర సంసార మోక్షాయ దైవీ ప్రకృతి. నిబంధాయ ఆసురీ రాక్షసీ చేతి దైవ్యా ఆదానాయ ప్రదర్శనం క్రియతే ఇతరయోః పరివర్జనాయచ. సంసార బంధం నుంచి మోక్షాన్ని ప్రసాదించేది గనుక దైవ సంపద నభ్యసించమని చెప్పటానికీ మిగతా రెండు అలాటివి కావు గనుక వాటిని వదులుకోమని చెప్పటానికేనట. ఇక్కడ ఆసుర రాక్షస