కాదిందులో. కింతు సర్వశ్చవేదార్థ ఇహపరి సమాప్తః - సమస్త వేదాల విషయమూ ఇందులోనే గతార్థ మవుతున్నది. యస్తం వేద సవేద విత్ వేదైశ్చసర్వై రహమేవవేద్యః అనే మాటలీ భావాన్నే సమర్థిస్తున్నాయని కూడా పేర్కొంటారు భాష్యకారులు.
అంతేకాదు. ఏతద్బుద్ధ్వా. ఇక్కడ మేము బోధించిన పరమరహస్యాన్ని గట్టిగా పట్టుకోగలిగితే వాడే బుద్ధిమంతుడూ వాడే కృతార్ధుడూ అవుతాడని చెప్పటం మూలాన మనమేమని అర్థం చేసుకోవాలి. యత్ కర్తవ్యం తత్సర్వం భగవత్తత్త్వే విదితే కృతం భవేత్ - నచ అన్యథా కర్తవ్యం పరిసమాప్యతే కస్యచిద్ జీవితంలో ఏ మానవుడైనా భగవత్తత్త్వాన్ని స్వానుభవానికి తెచ్చుకొనే విద్య సాధిస్తేనే వాడి కర్తవ్య మక్కడికి ముగుస్తుందిగాని అది గాదని ఇక ఏ విద్యపట్టుకొన్నా వాడి పని పరిసమాప్తం కాదని కూడా గ్రహించాలి మనం. సర్వం కర్మాఖిలంపార్థ జ్ఞానే పరిసమాప్యతే ఆత్మజ్ఞానంలోనే మనం చేసే పనులన్నీ తీరిపోతాయని గీత ఇంతకు పూర్వమే బోధించింది గదా. పోతే మనువు కూడా ఇదే నొక్కి వక్కాణించాడు. ఏతద్ధి జన్మ సామగ్ర్యం బ్రాహ్మణస్య విశేషతః ప్రాప్యై తత్ కృతకృత్యోహి ద్విజోభవతి నాన్యథా. ఈ జ్ఞానమే మానవ జన్మకు సంపూర్ణత. ఇది సాధిస్తేనే వాడు ద్విజుడు. రెండు జన్మ లెత్తిన వాడు ద్విజుడు. రెండు జన్మ లేమిటి.