#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

  కాగా అలాటి గొప్ప రహస్య మిద ముక్తం మయా. నీకు నేను బోధించా నర్జునా అంటాడు పరమాత్మ. అర్జునుడు తన కన్యుడు కాడుగదా ఎలా బోధించ గలిగాడు. అర్జున రూపంలో ఉన్నది నేనేననే దృష్టి సడలకుండా బోధించాడని సమాధానం. అలాటి దృష్టి అర్జునుడి కుంటేనో. ఉంటే మంచిదే కాదనలేము. కాని అతని కలాటి దృష్టి ఉందా అని సందేహం. అందుకే అంటున్నాడు మరలా పరమాత్మ. ఏమని. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతశృత్యశ్చ భారత - ఇది నేనెలా బోధించానో నీకలాగే అర్థం చేసుకోగలిగితే నీవు బుద్ధిమంతుడవే. కృతకృత్యుడవే. నీవేగాదు. లోకంలో ఎవడు ఎప్పుడిది గ్రహించినా వాడు ధన్యుడేనని హామీ ఇస్తున్నాడు.

  ఇక్కడ కొంత విచారణ చేయవలసి ఉంది మనం. అది భగవత్సాదులే చేస్తున్నారు మన తరపున. యద్యపి గీతాఖ్యం సమస్తం శాస్త్రముచ్యతే. భగవద్గీత అంతా శాస్త్రమేగదా. మరలాంటప్పుడీ అధ్యాయ మొక్కటే శాస్త్రమని పేర్కొంటున్నా డేమిటి వ్యాసభగవానుడు. నిష్కారణంగా పేర్కొనడు గదా. నిష్కారణం గాదు సకారణమే. ఎందుకంటే సర్వోహి గీతాశాస్త్రార్థః అస్మిన్నధ్యాయే సమాసేన ఉక్తః మొత్తం 18 అధ్యాయాల శాస్త్రార్థమంతా ఈ ఒక్క అధ్యాయంలోనే క్లుప్తంగా బోధించాడు మహర్షి అది ఎలాగంటే

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు