అని విభజన అంటే విడిపోవటమని గదా ఇంతకు ముందునుంచీ చెబుతూ వచ్చాను. అది గుర్తుచేసుకోండి సాధకులైనవారు.
ఇతి గుహ్యతమం శాస్త్ర - మిదముక్తం మయా-నఘ
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత - 20
మొత్తం మీద సర్వాత్మకమైన తత్త్వాన్ని అన్యంగాగాక అనన్యంగా ఆత్మ స్వరూపంగా దర్శించట మొక్కటే చాలు. అదే మోక్ష సాధనం. ఇతి గుహ్యతమం శాస్త్రం. ఇంతకన్నా మానవుడు తెలుసుకోవలసిన జీవిత రహస్యం లేదు. గుహ్యతమ మిది. రహస్యాలలోకి రహస్యం. ఎందుకంటే మిగతా లోకరహస్యాలైనా శాస్త్ర రహస్యాలైనా భౌతికం. అవి మనదగ్గరే ఉంచుకోవచ్చు. మరొకరికి చెప్పినా చెప్పవచ్చు. చెబితే గ్రహించవచ్చు. మన జ్ఞానానికి గోచరించేవవి. అంతేగాక ఎక్కడికక్కడ పరిచ్ఛిన్నమైనవి కూడా. పోతే ఇది అలాంటిది కాదీ రహస్యం. తెలియనంతవరకూ ఎవ్వరికీ తెలియదు. తెలిస్తే ఇక చెప్పటాని కెవ్వరూ లేరు. నేనూ అదీ ఇతరులూ అందరూ కలిసి నా స్వరూపమే అయి కూచుంటారు. అయితే నాకు నేనే చెప్పుకొన్నట్టవుతుంది. జ్ఞానమే అది. జ్ఞాన గోచరం కాదు. అందుకే అది గుహ్యతమం.