ఖర్చయిపోవటం మారటం. ఒక రూపంపోయి మరొక రూపం రావటం. అలాంటి దేదీ జరగలేదిక్కడ. అయితే కూటస్థంగా ఉన్న తత్త్వమే గుణత్రయాన్ని ఎలా సృష్టించింది. దీనితో ఎలా వ్యవహరిస్తున్నది. స్వరూప సద్భావమాత్రేణ అని సమర్థిస్తారు భగవత్పాదులు. అది అలా ఉండటమే ఇది ఇలా కనపడటమట. సూర్యుడు తానుప్రకాశిస్తూ ఉండటమే లోకాన్ని ప్రకాశింపజేయటం. ప్రకాశించటానికి భిన్నంగా ప్రకాశింపజేయట మనేది ఒక పని గాదు. అలాటి పనేదీ వాస్తవంలో పెట్టుకోలేదా మండలం. కాని అలాపెట్టుకొన్నట్టు మనకు భాసిస్తున్నది. అలాగే పరమాత్మ తాను తన పాటికి ఉండటమే ఈ సృష్టి లయాది వ్యాపారాలు చేస్తున్నట్టు మనకు అనేజదేకం మనసో జవీయః అనే శ్రుతి వాక్యానికిదే కనిపించటం అర్థం. ఇలా ఉదాసీనంగా ఉంటూనే ఏ మార్పు లేకుండా వ్యవహరించటమెలా సంభవమని అడిగితే జవాబొక్కటే. అదే భగవన్మాయాశక్తి. అఘటన ఘటనా పటీయసీ మాయా. అసంభవాన్ని సంభవం చేసి చూపటమే మాయా అంటే. అలాకాకుంటే శక్తి అనే మాటకర్థ మేముంది. కాబట్టి ఉభయ భాషా ప్రవీణుడు పరమాత్మ. అన్ని వైరుధ్యాలూ అక్కడ సమసిపోవలసిందే. సమన్వయం కావలసిందే. తప్పదు. శక్తికి పని పెట్టకుంటే స్వరూపం స్వరూపంగానే ఉంటుంది. పనిపెట్టాడో అదే వివిధ రూపాలుగా మారి విభూతిగా కనిపిస్తుంది. అంచేత వ్యయమయినట్టు