#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

  మొదట క్షరాక్షరాలంటే ఏమో చెబుతున్నాడు మహర్షి. వీటి రెండింటికీ పురుషుడని పేరు పెట్టాడాయన. పురుష అంటే ఎక్కడికక్కడ పూర్ణంగా కనిపించేది. అలా కనిపిస్తున్నాయా క్షరాక్షరాలు రెండూ. ఇంతకూ ఆ క్షరమేమిటి అక్షర మేమిటి. క్షర స్సర్వాణి భూతాని. ఇహ పరాలు రెండూ వ్యాపించి ఒక దయ్యం లాగా కనిపించే ఈ సమస్త భూత ప్రపంచమూ క్షరం. భూతమంటే అది బ్రహ్మాండమైనా కావచ్చు. పిండాడమైనా కావచ్చు. అంటే జీవజగత్తులు. ఇవి రెండూ క్షరం క్రిందికే వస్తాయి. క్షరతీతి క్షరం. నశించే స్వభావ మున్నదేదో అదిక్షరం. వికారజాతమని వ్రాస్తున్నారు భాష్యకారులు. ఎప్పుడూ మారుతూ పోవడమే నశించటం. ఒకే రూపంలో ఉండదెప్పుడూ ఈ జగత్తుగానీ జీవుడుగానీ. సృష్టిలయాలూ జనన మరణాలూ అనుభవిస్తూనే ఉంటాయి.

  పోతే ఇక అక్షరమేమిటి. కూటస్థో క్షర ఉచ్యతే. కూటస్థమైన దేదో అది అక్షరం. కూటస్థ మక్షరమనే మాటలు రెండూ చెవిని బడగానే మనకు పరమాత్మ గుర్తువస్తాడు - క్షరం కానిదీ ఎప్పటికీ ఒకే స్వరూపంలో ఉండేదీ పరమాత్మ అనేగదా వర్ణిస్తుంది శాస్త్రం. కాని ఇక్కడ పరమాత్మ అనిగాదు అర్థం. ఎందుకంటే పరమాత్మే అయితే ఉత్తమః పురుషస్త్వన్యః ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. వాడు క్షరమతీతోహ మక్షరా దవి. క్షరాక్షరాలకు రెంటికీ విలక్షణంగా ఉంటాడని పేర్కొనుదు గీత. మరి ఈ అక్షరమేమి

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు