ఎలాంటిదో వర్ణించి చెప్పాడు. ఆ విభూతి కూడా సర్వత్రా సమానంగా వ్యాపించినప్పటికీ విశేషరూపంగా ఎక్కడెక్కడ వ్యక్తమయి కనిపిస్తున్న అలాంటి సూర్యచంద్రాగ్ని మనోబుద్ద్యాదులను ప్రత్యేకించి పేర్కొన్నాడాయన. అయితే సామాన్యమనిచెప్పు విశేషమని చెప్పు ఏ ఉపాధిలోనైనా సరే. వ్యక్తావ్యక్తంగా కనిపిస్తున్నదా భగవద్విభూతే ననే సత్యాన్ని మరిచిపోరాదు. కాని భగవత్తత్త్వమేమిటో దాన్ని గుర్తించకుండా విభూతిని మాత్రమే చూస్తే సమస్యకు పరిష్కారం లేదు. వస్తుజ్ఞానం లేకుండా ఆ భాసను చూస్తే ఆభాసే వాస్తవమయి కూచుంటుంది. అంచేత ఈ విభూతికంతటికీ ఆధారభూతమైన ఆ పరమాత్మ స్వరూపమేదో అది బయటపెడు తున్నాడిప్పుడు మహర్షి అందులోనూ క్షరమనీ అక్షరమనీ క్షరాక్షరాతీతమనీ మొత్తం విషయమంతా మూడు వర్గాలుగా విభజించాడు. అందులో క్షరాక్షరాలు రెండూ ఉపాధులని చెప్పి ఈ ఉపాధులు రెండింటి ద్వారా నిరుపాధికమైన ఆ మూడవదాని స్వరూప మిదమిత్థమని నిర్ధారణ చేయదలచాడు. అసలీ మూడింటి వర్ణనలోనే ఇంతవరకూ జరిగిపోయిన అధ్యాయాల విషయం ఇక రాబోయే అధ్యాయాల విషయమంతా కలిసి వస్తుందని మనకు భాష్యకారులు సెలవిస్తున్నారు.
ద్వావిమౌ పురుషౌ పార్థ - క్షర శ్చాక్షర ఏవచ
క్షరస్సర్వాణి భూతాని - కూటస్థ-క్షర ఉచ్యతే - 16