గాని అన్ని క్షేత్రాలూ వ్యాపించిన జ్ఞానం నాకు కలగదు. అదే ఔపదేశికం. కాబట్టి స్వాభావికానికీ ఔపదేశికానికీ ఇంత అంతరమున్నది. హస్తి మశ కాంతరమది. రెండూ జ్ఞానమే అయినా ఒకటి శరీరం మేరకే పరిమితమయి అందులో బందీ అయిన జ్ఞానం. అందులో నుంచి బయటపడేది కాదది. మోక్షమనే ఆశ లేదు దానికి. అదీ మేము స్వాభావికమని పేర్కొనటం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అది. గుడ్డి కన్ను. పోతే ఔపదేశిక మలాకాక అన్ని శరీరాలలో విస్తరించినది గనుక ఒకదానిలో బందీ అయినది కాదు. ముక్తమైన జ్ఞానమది. దీనినే ఔపదేశిక మంటారు భగవత్పాదులు. మొదటిది సంసార బంధంలో పడదోసేదైతే - రెండవది అందులో నుంచి విముక్తి కల్పించేది. ఇలాటి జ్ఞానమున్నవాడే అసలైన క్షేత్రజ్ఞుడు. వాడీ ఒక్కక్షేత్రంలోనే గాదు సర్వక్షేత్రాలనూ వ్యాపించి సర్వత్రా వీర విహారం చేస్తుంటాడు.
అలా చేస్తున్నాడంటే క్షేత్రాలన్నీ తనకంటే అన్యమని భావించి చేస్తాడని గాదు. అలా భావిస్తే అది అజ్ఞానమే మరలా. అసలైన జ్ఞానం కాదు. అయితే మరి ఏది అసలైన జ్ఞానం. చెబుతున్నాడు మహర్షి. వినండి. క్షేత్ర క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం. నేను వ్యాపించిన ఈ క్షేత్రాలూ వీటిని దర్శించే నేనూ రెండూ కలిసినా స్వరూపమేనని రెండింటినీ ఏకంగా అనుభవానికి తెచ్చుకొనే జ్ఞానమే సరియైన జ్ఞానం. సమ్యగ్ జ్ఞానం. అలా కాని పక్షంలో ఎన్ని క్షేత్రాలలో విహరించినా సుఖం లేదు. క్షేత్రాలు వేరుగానే కనపడుతుంటాయి క్షేత్రజ్ఞుడికి. కనపడితే అది ద్వైత జ్ఞానమే. ద్వైత జ్ఞానం భ్రాంతి జ్ఞానమే గాని సమ్యగ్ జ్ఞానమని పించుకోలేదు.