#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

అవి రెండూ కనపడవు పైకి. వారి ఉపాధులీ జీవజగత్తులే దర్శన మిస్తుంటాయి. ఇవి కేవల ముపాధులే సుమా వీటి ద్వారా వీటి వ్యవహారమంతా నడుపుతున్నది నేనూ నా శక్తేనని మనకు భంగ్యంతరంగా చాటి చెబుతున్నాడు పరమాత్మ.

సర్వస్య చాహం హృది సన్నివిష్టః
మత్తః స్మృతి రాన మపోహనంచ
వేదైశ్చ సర్యైరహ మేవ వేద్యః
వేదాంత కృద్వేద నిదేవ చాహమ్ - 15

  అంతేకాదు. ఇంకా ఒక రహస్యం మనకు బోధిస్తున్నాడు. ఆదిత్య చంద్రాగ్నుల లాంటి అచేతన పదార్థాలలోనే కాదు. చేతనులైన జీవుల శరీరాలలోకూడా వైశ్వానరరూపంగా ఉండటమే కాదు. ఆ జీవులలోకూడా జరాయు జాలూ అందులోనూ మానవుడనే జీవిలో విశేషంగా వచ్చి కూచున్నాడా పరమాత్మ. అదేమిటీ స్థావరజంగమాలనే తేడా లేకుండా వ్యాపించి ఉందిగదా చైతన్యం. వ్యాపించటమేమో వ్యాపించే ఉంది కాని ఊరక ఉండటం వేరు. అభివ్యక్తమయి ఉండటం వేరు. ఇంతకు ముందేగదా చెప్పారు భగవత్పాదులు. మన ముఖం అన్ని పదార్థాల మధ్యలో ఉన్నా వాటిలో ఎందులోనూ గాక ఒక అద్దంలోనే ప్రకటమై కనిపిస్తుందని. అద్దం కూడా స్వచ్ఛం స్వచ్ఛతరమయ్యే కొద్దీ అంతకంతకూ స్పష్టంగా గోచరిస్తుందని కూడా గదా పేర్కొన్నాడు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు