#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

భక్ష్యం భోజ్యం లేహ్యం చోష్యమని నాలుగు రకాలవి. ఇందులో భోక్తా వైశ్వానరోగ్నిః అగ్నేర్భోజ్యమన్నం సోమః - తదేతదుభయం అగ్నీషోమౌ సర్వమని శ్రుతి చాటుతున్నది. అన్నం మనం తినేదైతే అన్నాదుడు మనలో ఈ వైశ్వానరుడు. ఈ భోక్తృభోజ్య సంబంధమే సర్వప్రపంచమూ. అదే అగ్నీషోమమనే యాగంలో ఉండే సంకేతమని కూడా అభిజ్ఞుల మాట.

  ఇలా పశ్యతః అన్న దోషలేపో నభవతి అన్నలేప దోషం లేదట. అన్న లేప మేమిటి దోష మేమిటి. ఇందులో చాలా పెద్ద సంకేతమున్నది అన్నమంటే మన అనుభవానికి వచ్చే చరాచర ప్రపంచం. ఇది అన్నమైతే అన్నాదుడు మనలో ఉన్న అగ్ని. వైశ్వానరుడా. కాదు. విశ్వనరులనూ వ్యాపించిన జ్ఞానాగ్నే వైశ్వానరుడు. అదే ఈ అనుభవాలన్నీ పొందుతున్నది. అప్పటి కన్నాన్నాదులంటే జ్ఞానజ్ఞేయాలని The knower and known. అర్థం. జ్ఞేయాన్ని ఆహారంగా మనస్సు స్వీకరిస్తున్నప్పుడు రాగ ద్వేషాలూ సుఖదుఃఖాలనే దోషం దాని కంటుతుంటుంది. అదే లేపం. అదిపోయి జ్ఞానం శుద్ధి చెందాలంటే జ్ఞేయ ప్రపంచాన్ని గూడా జ్ఞానంలో కలుపుకొని జ్ఞానాత్మకంగానే మానవుడు దర్శించగలిగి ఉండాలి. ఈ ఏకాత్మ భావమే అగ్నీ షోమయాగంలో ఇమిడిఉన్న నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యం.

  ఇంతకూ భోక్త జీవుడైతే భోజ్యం జగత్తయితే ఈ భోజ్యాన్ని భోక్త అనుభవించే శక్తి ఎక్కడిది. దాని కాశ్రయమైన చైతన్యమేది. ఇది మన మన్వేషించి పట్టుకోవలసింది. ఆ చైతన్యమే ఈశ్వరుడు. ఆయన శక్తే మాయ.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు