#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

అహం వైశ్వానరో భూత్వా - ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ 14

  అంతేకాదు. ఇంకా ఒక విశేషముంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ఇంతవరకూ సూర్యుడు సోముడని పృథివి అని అచేతనమైన సృష్టినే చెబుతూవచ్చాడు. ఇలా అచేతనమైన జగత్తునేగాదు పరమాత్మ వ్యాపించింది. చేతనులైన ప్రాణులలో కూడా ప్రవేశించి వారిని కూడా నడుపుతున్నాడు. సర్వవ్యాపకు డన్నప్పుడు అచేతన మేమిటి చేతన మేమిటి అంతటా ప్రసరించిందా పరమాత్మ తత్త్వం, అదే పేర్కొంటున్నా రిప్పుడు నేను వైశ్వానరాగ్ని రూపం ధరించి ఈ జీవుల శరీరాల్లో చేరిపోయానంటాడు విశ్వనరులంటే సమస్త ప్రాణులూ. వీరిలో ఉంది కాబట్టి అగ్నికి వైశ్వానరుడని పేరు. అదేదో గాదు. మన జఠరాగ్ని. అయమగ్ని ర్వైశ్వానరో యోయమంతః పురుషే యేనేదమన్నం పచ్యతే అనివేదం. మానవుల శరీరంలో చేరి ఏది వారు తినే ఆహారాన్ని జీర్ణంచేసి శక్తిని ప్రసాదిస్తుందో అదీ వైశ్వానరాగ్ని.

  ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అది ఎంత పచనం చేసినా అలా పచనం చేయాలంటే దానికి ప్రాణాపానాలు తోడుకావాలి. ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలకే ప్రాణాపానాలని పేరు. అవి నిరంతరమూ రాకపోకలు చేస్తుంటేగాని జఠరాగ్నికి ఆహారాన్ని పచనం చేసే శక్తి సరఫరా కాదు. ఆహారమంటే అది ఒకటిగాదు. చతుర్విధం

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు