#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

చైతన్యానికి శక్తికూడా పరిపూర్ణంగానే ఉంటుందని గదా చెప్పాము. దానికే ఓజస్సు బలమని పేరు. కేవల శక్తి కాదు కేవల చైతన్యమూ గాదు. జ్ఞానానికి క్రియతోడవ్వాలి. అలాగైతేనే ధారణ చేయలదు. ఈ సూక్ష్మం తెలియక సాంఖ్యులు దెబ్బతిన్నారు. వారు జడమైన ప్రకృతే అన్ని పనులూ చేస్తున్నదంటారు. చైతన్య సహాయం లేకుండా జడమే సర్వమూ స్వతంత్రంగా నిర్వహించలేదని అద్వైతుల సిద్ధాంతం.

  పోతే పుష్ణామి చౌషధీ స్పర్వా స్సోమో భూత్వారసాత్మకః - అంతేగాక చంద్రుడు కూడా నేనే అయి పైరుపంటల అన్నింటిపెరుగుదలకు ఆధార మవుతున్నాను. వాటిని క్షీణించి పోకుండా పోషిస్తున్నా నంటాడు. ఎలాగంటే ఆ సూర్యుడు ఉష్ణగుణమైతే సోముడు శీతగుణం. రసమంటే జలస్వభావమైన శీతలత్వం. మరీ ఉష్ణమైతే సృష్టిలేదు. స్థితిలేదు. కేవలం శీతలమైనా లేదు. రెండూ సమపాళ్లలో కలిసి ఉన్నప్పుడే ఓషధుల దగ్గరి నుంచీ సమస్త ప్రాణులూ పుడుతుంటాయి. పెరుగుతుంటాయి. అలా లేకుంటే సృష్టిలేదు స్థితిలేదు వాటికి. లయమే శరణ్యం. అంచేత సృష్టి స్థితులు యధావిధిగా జరగాలంటే సూర్యుడుండాలి చంద్రుడుండాలి. ఉపాదాన భూతమైన పృథివీ ఉండాలి. కేవలమీ మూడే అయితే సరిపోదు. అవి జడపదార్థాలు. వాటిలో ఉన్న శక్తీ జడమే. దాని ద్వారా ప్రసరించే చైతన్య ప్రకాశమొకటి ఉండాలి. అదే దాధార పృథివీ ముతద్యామని మంత్ర వర్ణం బయటపెడుతున్నది. ఇంతఉన్న దిందులో అంతరార్థం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు