అది ఏమాత్రమూ ప్రతిఫలించదు. ఒక అద్దంలో అయితే ప్రతిబింబిస్తుంది. అందులో కూడా స్వచ్ఛమూ స్వచ్ఛతరమూ అయితే ఆ అద్దమనే ఉపాధి గుణాన్ని బట్టి స్పష్టంగా అతి స్పష్టంగా స్పష్టాస్పష్టంగా తర తమ భావంతో కనిపిస్తుంటుంది. అలాగే చైతన్యంలో మార్పులేదు. అది అంతటా సమానంగానే ఉంది. కాని నదీ పర్వత పట్టణాది జడ పదార్థాలలో అసలే ప్రకటం కాదు. గుప్తమయి ఉంటుంది. అద్దంలాంటి మానవుని బుద్ధిలో అయితే ప్రకటమై కనిపిస్తుంది. అందులో కూడా సాత్త్వికమైతే బాగా ప్రకాశిస్తుంది. రాజస తామసబుద్ధులలో స్పష్టా స్పష్టంగా అస్పష్టంగా గోచరిస్తుంటుంది. ఇది మనఅందరికీ అనుభవ సిద్ధమేనంటారు భాష్యకారులు.
గామావిశ్యచభూతాని - ధారయా మ్యహ మోజసా
పుష్టామి చౌషధీ స్సర్వా - స్సోమోభూత్వా రసాత్మకః - 13
గో అంటే ఇక్కడ భూమి అని అర్థం. గామావిశ్యచ భూతాని ధారయామి ఈ భూమండలంలో ప్రవేశించి దీనినంతటినీ వ్యాపించి నేనే దీన్ని ఇలా నిలిపి ఉంచానంటాడు పరమాత్మ. అంతర్యామి రూపంగా ఈ పృథ్విలో ఉన్నదీ దీన్ని ఇలా తిప్పుతున్నదీ పరమాత్మే. బృహదారణ్యక మేమని చెబుతున్నది. యః పృథివ్యాం తిష్ఠన్ - యః పృథివీమంతరో - య మయతి అని. ఎలా నిలుపుతున్నాడని అడిగితే ఓజసా. తన శక్తితో. పరిపూర్ణమైన