ప్రకాశాలుగదా. పరమాత్మవే ఈ ప్రకాశా లన్నప్పు డాయనగారు కూడా అచేతనమా అని ఆశంక రావచ్చు. అందుకే భగత్పాదు లొకమాట వ్రాస్తున్నా రిక్కడ.
యథా ఆదిత్య గతం తేజః చైతన్యాత్మకం జ్యోతిః - ఆదిత్యాదులలో ఉన్న తేజస్సు జడమైన తేజస్సను కొంటున్నారా అది ఆదిత్యుడిదే అయితే జడమే. కాని అది పరమాత్మ తేజస్సని పేర్కొన్నాము. పరమాత్మ చేతను డయినప్పుడది అచేతన మెలా అవుతుంది. పరమాత్మ తేజస్సని ఎప్పుడన్నాడో అప్పుడాదిత్యాదుల ద్వారా ప్రసరిస్తున్న ఆ తేజస్సు చైతన్యాత్మకమే కావాలని వ్యాఖ్యానించా రాయన.
అయితే ఒక సందేహ మిక్కడ. చైతనాత్మకమైన పరమాత్మ జ్యోతి స్థావరజంగమా లన్నిటిలో సమానంగానే పరచుకొని ఉన్నది గదా. అది ఆదిత్యాది మండలాలలోనే ఉందని వర్ణించుట మేమిటి. నిజమే. సమానంగానే ఉంది. కాని సత్త్వగుణాధిక్యం వల్ల ఒక్కొకచోట ఎక్కువ తక్కువలుగా కనిపిస్తుంటుందది. సత్త్వమనేది అత్యంత నిర్మలమూ అత్యంత భాస్వరమూ అయిన గుణం. అది ఎక్కడ అధికంగా ఉంటుందో ఆ ఉపాధిలో పరమాత్మ చైతన్యజ్యోతి అధికంగా బయటపడుతుంది. ఉపాధిగుణం తగ్గిపోయేకొద్దీ తగ్గుతూపోతుంది దాని మోతాదు. లోకంలో కూడా చూడండి తుల్యేపి ముఖసంస్థానే. మన ముఖంలో తేడా లేకపోయినా కాష్ఠకుడ్యాలలో