లేనేలేదు. ఉన్నట్టు కనిపించినా అది దాని విభూతే దానివిస్తారమే అని చూస్తే ఏ గొడవాలేదు. ఇదీ ఇందులో సూక్ష్మం. ఇప్పుడతడు భగవద్విభూతి ఎలాంటిదో వివక్షుః చతుర్భిః శ్లోకైర్విభూతి సంక్షేప మాహ భగవానని మనకు చెబుతున్నారు భాష్యకారులు. తన విభూతి ఏదో చెప్పదలచుకొని మనకు చెబుతున్నాడట భగవానుడు. ఇంతకు ముందుకూడా చెప్పారు గదా అంటే సంక్షిప్తంగా నంటున్నారు.
యదాదిత్యగతం తేజో - జగద్భాసయతే ఖిలం
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ- తత్తేజోవిద్దిమామకమ్ - 12
యదాద్యిగతం తేజః - సూర్యమండలంలో ఉండి ఏ తేజస్సయితే ఈ సమస్త ప్రపంచాన్నీ ప్రకాశింప చేస్తున్నదో యచ్చంద్రమసి - యచ్ఛాగ్నౌ అలాగే ఏది చంద్రుడిలో అగ్నిలో ఉండి యథాశక్తిగా పదార్థాలను వెలిగిస్తున్నదో అది ఏమిటనుకొంటున్నారా తేజస్సు. సూర్యచంద్రాదులకు సొంతం కాదది. వారిలో సహజంగా లేదు. మరేమి టంటారు ఎవరిదంటారు. తత్తేజోవిద్ధిమామకం ఎవరిదో ఏమిటి నాదేనంటున్నాడు పరమాత్మ. తనలోనే సహజమది. తనకు సహజంగా ఉన్న తేజస్సునే ఆదిత్యాదులకు పంచిపెట్టా డాయన. ఆదిత్యాదులు కేవలమూ పరమాత్మ విభూతి శకలాలు. వీటి ద్వారా పరమాత్మ తేజస్సే ఆయా రూపాలుగా అభివ్యక్తమయి కనిపిస్తున్నదని భావం. మరి ఇవన్నీ అచేతనమైన