#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

అది మనః ప్రాణాద్యుపాధులతో చేతులు కలిపి కలుషిత మయింది. కాకున్నా అయినట్టు భాసిస్తున్నది. ఇది నేను కాను వీటికి సాక్షిగా ఉన్న చైతన్యమేనని ఎప్పుడు గుర్తుచేసు కొంటాడో అప్పుడక్కడే ఉన్న తన స్వరూపం బయటపడి కనిపిస్తుంది. కనిపిస్తే అది నిర్గుణమూ వ్యాపకమూ గనుక మిగతా మనః ప్రాణాది కలాపమంతా తనకు జ్ఞేయంగా గాక జ్ఞాన స్వరూపంగానే దర్శనమిస్తుంది. అప్పుడంతా ఆత్మే. అనాత్మగంధం కూడా ఉండబోదు.

  అయితే అటు ఉత్తమాధికారీ గాక ఇటు మధ్యమాధికారీ కాని మానవులు మాత్రం యతంతోపి మందబుద్ధులు కాబట్టి ఎంతో ప్రయత్నంచినా నైనం పశ్యం త్యచేతసః తమకు పట్టిన బుద్ధిమాంద్యం వల్ల మాలిన్యంవల్ల ఏమాత్రమూ చూడలేరా తత్త్వాన్ని. బుద్ధిమాలిన్యమెలా ఏర్పడింది వారికి. అకృతాత్మానః శాస్త్ర ప్రమాణంలో కృషి చేయలేదువారు. అంతేకాదు. తమ ఇంద్రియాలమీద నిగ్రహంలేదు. ఎంత శ్రవణం చేస్తున్నా దుర్మార్గమైన ప్రవర్తన మానుకో లేరు. ఎన్నో వాసనలు పేరుకొని ఉంటాయి వారి మనస్సులో. వాటిని కడిగేసుకో కుండానే అందుకోవాలని చూస్తారు. అందుకే అకృతాత్మానః మనస్సుకు సంస్కారంలేదు శుద్ధిలేదు. అశుద్ధమైన మనస్సు నదుపులో ఉంచుకొని చూడబోతే ఎలా కనిపిస్తుందని. అదీ అశుద్ధంగానే కనిపిస్తుంది. యద్భావ స్తద్భవతి అందుకే ఎంతో ప్రయత్నిస్తున్నా అది నిష్ఫలం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు