కారణమని గూడా గ్రహించి ఉన్నాము. అంచేత స్వతహాగా పరిశుద్ధుడైనా ఈశ్వర స్వరూపుడే అయినా ప్రకృతి స్థాని కర్షతి - ప్రకృతి గుణాలను తనవైపు తిప్పుకొని వాటితో మమేక మయిపోయాడు. అంచేతనే తన సాక్షిభావం పోగొట్టుకొని కర్త భోక్తగా మారి జీవుడనిపించు కొంటున్నాడు.
శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి - వాయుర్గంధా నివాశ్రయాత్ - 8
ఈశ్వరః వీడు నిజంగా ఈశ్వరుడే. మొత్తం ప్రపంచానికి కాదు శరీర సంఘ్రాతానికి మాత్రమే ఈశ్వరుడయి కూచున్నాడు. కారణం ఈశ్వరత్వం వస్తుసిద్ధంగా సర్వప్రపంచానికీ అయినా బుద్ధి సిద్ధంగా లేదది. తన పిండ శరీరానికి మాత్రమే పరిమిత మయినట్టు భావిస్తున్నాడు. కనుకనే శరీరం యదవాప్నోతి - యచ్ఛాప్యుత్రామతి. ఈ శరీరంలో వచ్చి తాను ప్రవేశిస్తున్నా మరలా ప్రారబ్ధంతీరి దీన్నివదిలేసి వెళ్లిపోతున్నా - గృహీత్వైతాని సంయాతి. మనస్సూ మొదలైన ఇంద్రియ గుణాల నన్నింటినీ వెంటబెట్టుకొనే వస్తుంటాడు పోతుంటాడు. ఎప్పుడూ వాటిని దూరం చేసుకోలేడు. దూరం చేసుకోటానికవి తన గుణాలు కావు ప్రకృతి గుణాలని వివేచన చేసి చూస్తేగదా. ఆత్మానాత్మ వివేకమేది వీడికి లేదు. వివేకం లేకనే అనాత్మగుణాల నాత్మ మీద ఆరోపించుకొని సచ్చిదాత్మకమైన తన స్వరూపాన్ని మరచిపోయాడు. అలాటి మిథ్యాజ్ఞాన మున్నంతవరకూ