జలనిమిత్తాపాయే సూర్యమేవగత్వా ననివర్తతే - తేనైన ఆత్మనా గచ్ఛతి యథాఘటా ద్యుపాధి పరిచ్ఛిన్నో ఘటాద్యాకాశః ఆకాశాంశస్పన్ ఘటాది నిమిత్తా పాయే ఆకాశం ప్రాప్య ననివర్తతే ఏవమేవ. అతః ఉపపన్న ముక్తం యద్గత్వా ననివర్తంత ఇతి. సూర్యుడు జలంలో ప్రతిఫలిస్తే ఆ సూర్యాంశ జలం తొలగిపోతే ఆ సూర్యుడిలోనే కరిగిపోయి మరలా తిరిగి రాదో - ఒక ఘటంలో కనిపించే ఘటాకాశం ఆకాశంలో ఒక అంశగా కనిపిస్తున్నా ఘటం పగిలిపోతే ఆ మహాకాశంలో చేరిపోయి మరలా వెనక్కురాదో అలాగే పరమాత్మాంశగా భాసించే ఈ జీవచైతన్యం కూడా ఆ మహాచైతన్యంతో ఏకమైతే తిరిగి రాబోదు. ఇదీ ఇందులో ఉపపపత్తి.
అయితే నిరవయవం నిరాకారం గదా పరమాత్మ తత్త్వం. అందులో జీవుడనే అంశ అవయవమెలా ఏర్పడింది. అసంభవం గదా పోనీ సావయవ మంటారా అది మరీ ప్రమాదం. సావయవమైతే వినాశప్రసంగః అవయవ విభాగాత్ అవయవాలు తొలగిపోతే అసలే లేదా పదార్థం అని మరలా ప్రశ్నవేసుకొని భాష్యకారులు దానికి కూడా పరిహారం చెబుతున్నారు. అవిద్యాకృతోపాధి పరిచ్ఛిన్న ఏక దేశః అంశ ఇవ కల్పితః అని. ఏమిటంటే అసలు అంశే ఏర్పడలేదు. అది కేవలం కల్పన. ఎవరు కల్పించారది. అవిద్య. అదే శరీరమనే ఒక ఉపాధి కల్పించి అందులో ఘటాకాశంలాగా ఒక చైతన్యాంశ ఉన్నట్టు చూపుతున్నది. అంతకుమించి చైతన్యంలో అంశఅంటూ వాస్తవంగా ఏర్పడలేదు.