నివృత్తిః ఒక చోటికి వెళ్లటమంటే మళ్లీ రావటం కూడా ఉండటం చూస్తున్నాము గదా లోకంలో. సంయోగాలన్నీ వియోగంతో ఆఖరని కూడా పెద్దలు చెబుతున్న మాట. అలాంటప్పుడు పరమమైన స్థానమందుకొన్న వాడు తిరిగి రాడని ఎలా చెప్పగలరని భగవత్పాదులే వేసుకొన్నారీ ప్రశ్న. వేసుకొని దానికి సమాధానమే ఈ శ్లోకమని రాబోయే శ్లోకాని కవతారిక వ్రాశారు. అదేమిటో శ్లోకమే బయటపెడుతున్నది చూడండి.
మమైవాంశో జీవలోకే - జీవ భూత స్సనాతనః
మనషష్ఠా ణీంద్రియాణి - ప్రకృతిస్థాని కర్షతి -7
మమైన అంశో జీవలోకే జీవభూతః ఈ లోకంలో నేను కర్తనని భోక్తనని బ్రతుకుతున్న జీవుడెవడున్నాడో వాడెవడో గాదు మమైవాంశః పరమాత్మ నైన నా అంశే నా భాగమే నంటున్నాడు భగవానుడు. అంతేకాదు అంశమనగానే ఆ పరమాత్మ అంశి ఈ జీవాత్మ అంశమని శేష శేషి భావమని భ్రాంతిపడరాదు మరలా. అలా భ్రాంతి పడతారేమోననే పరమాత్మే చాటుతున్నాడు మరలా సనాతనః అని. పరమాత్మ ఎలా సనాతనుడో జీవాత్మకూడా అలాంటి వాడేనట. అంటే వచ్చేపోయే వాడు కాదు. ఎప్పుడూ ఉన్నవాడే.
ఇప్పుడు మన మడిగిన ప్రశ్నకేమి వచ్చింది సమాధానం. చెబుతున్నారు భాష్యకారులు వినండి. యధా జలసూర్యకః సూర్యాంశః