#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

దీన్ని కాదని త్రోసి పుచ్చి దాన్ని పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి. అదే అధ్యాత్మ నిత్యా అనే మాట కర్థం. అధ్మాత్మ అంటే ప్రత్యగాత్మ. పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఆత్మ. అదే నిత్యమూ ఉన్న నా స్వరూపమని గ్రహించాలి. గ్రహిస్తే ఏమవుతుంది. విని వృత్తకామాః - ఎలాటి కామమూ ఉండదు మనకు. తొలగిపోతాయి అన్ని కామాలూ. అవిద్య వల్లనే కామం. అసలైన ఆత్మ ఏదో తెలియక పోవటమే అవిద్య. దానిమూలంగా అనాత్మ ఒకటి తయారయితే దాన్ని పొందాలనే కోరికే కామం. అంతా ఆత్మేనని గ్రహిస్తే ఇక అవిద్య లేదు. తర్జన్యమైన కామమూ లేదు. ద్వం ద్వైర్వి ముక్తా స్సుఖదుఃఖ సంజ్ఞః - అవి రెండూ పోతే సుఖ దుఃఖాలనే ద్వంద్వాలెప్పుడో ఎగిరిపోతాయి. కామం వల్లనే కర్మ. కర్మ వల్లనే సుఖదుఃఖాది ఫలం. అదే లేని వాడికివి ఎక్కడివి. ఇలా అవిద్యా కామకర్మలు మూడూ పోతే మూడు శరీరాలూ ఎగిరిపోతాయి మానవుడికి. అలాటి వారే అమూఢాః మోహం లేనివారు. జ్ఞానులని అర్థం. ఏమవుతారు వారు. ఏమయ్యే దేముంది. గచ్చంతి. పదమవ్యయం తత్. ఎప్పుడూ మారిపోని తిరిగి రాని స్థితి ఏది ఉందో అదే అందుకొంటారు. బ్రహ్మీ స్థితి అంటారు దీన్ని. దాన్ని మించిన దశ లేదు. అనుభవం లేదు. బ్రహ్మానుభవమది. అదే మోక్షం. అదే పరిష్కారం జీవిత సమస్యకు.

న త ద్భా సయతే సూర్యో - వ శశాంకోన పావకః
యద్గత్వా ననివర్తంతే - తద్ధామ పరమం మమ - 6

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు