అనాత్మ ప్రపంచమంతా ఈ సూత్రాన్ని బట్టీ ఆ భాస అయి పోగలదు. ఇదీ టూకీగా చెబితే ఇందులో ఉన్న సాధన రహస్యం. ఇది ఇంతకు పూర్వమూ వచ్చిందీ సందర్భం. ఇప్పుడూ వచ్చింది. పూర్వాపరాలు కలియబోసుకొని చూస్తే మీకే తెలుస్తుంది.
నిర్మాన మోహా జిత సంగ దోషా
అధ్యాత్మ నిత్యా విని వృత్త కామా
ద్వం ద్వైర్విముక్తా స్సుఖ దుఃఖ సంజ్ఞ
ర్గచ్ఛం త్యమూఢాః పదమవ్యయంతత్ -5
ప్రతిషేధ లక్షణ ప్రమాణమని నిర్దేశించారు దీన్ని భగవత్పాదులు. పరమార్ధాన్ని పట్టుకోటానికిదే విధానం మరొకటి లేదని కూడా చాటుతారాయన. గీతాచార్యుడి మనసులో ఉన్నది కూడా ఇదే. అందుకే దాన్ని ఇంకా సాగదీసి చెబుతున్నారు. నేననే భావం దేహాదుల మేరకు సంకుచితం కాక విశాలం కావాలని గదా పేర్కొన్నాము. అలా కావాలంటే నిర్మాన మోహాః – మానమూ మోహమూ రెండూ ఉండగూడదు. మాన మంటే అభిమానం. దేహమే నేననే దేహాత్మ భావం. అది పోవాలి మొదట. అది పోవాలంటే అంతకన్నా మొదట దానికి కారణమైన మోహం పోవాలి. మోహమంటే అజ్ఞానం. అసలైన నేనెవరో నాకు తెలియక పోవటం. అందువల్లనే శరీరాదులే నేననే అభిమాన మేర్పడింది.