#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

  మంచిదే. ఇక్కడికి క్షేత్రమంటే ఏమిటో దాన్ని క్షేత్రమని ఎందుకన్నారో తెలిసిపోయింది. పోతే ఇక క్షేత్రజ్ఞుడనే వాడెవడో తెలుసుకోవలసి ఉంది. అదే చెబుతున్నాడిప్పుడు మహర్షి ఏత ద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ఈ శరీరమనే క్షేత్రాన్ని నిత్యమూ చూస్తూ గ్రహిస్తూ ఉన్నవాడెవడో వాడట క్షేత్రజ్ఞుడు. క్షేత్రం విజానాతీతి క్షేత్రజ్ఞః - ఎవడు వాడు. ఎలా గ్రహిస్తున్నాడు. ప్రస్తుతానికి మనబోటి జీవుడే క్షేత్రజ్ఞుడు. వాడేగదా ఈ శరీరంలో కూచొని దీన్ని ఆపాదమస్తకమూ నాదేనని తనకు విషయంగా Object చూచుకొంటున్నాడు. అయితే ఇది జీవులందరూ చేస్తున్న పనే. ప్రతి ఒక్కరూ ఎవరి శరీరం వారు నాదనే భావిస్తూంటారు. దీనికి స్వాభావిక జ్ఞాన Instinctive మని పేరు. ఇది గాక మరొక జ్ఞానముంది. దానికి ఔపదేశిక మని పేరంటారు భగవత్పాదులు. ఉపదేశం వల్ల వచ్చేది ఔపదేశికం. అది ఎలా ఉంటుందని అడుగుతారేమో. ఇది నాది అని అంటున్నప్పుడా అనేది ఏమిటి. అది ఎక్కడ ఉండి అంటున్నదా మాట. అది శరీరంతో ఏకమై అంటున్నదా శరీరానికి విలక్షణంగా ఎక్కడో ఉండి అంటున్నదా అని వివేచన చేయాలి. శరీరమే తానయి అన్నదో అలా అనటానికి వీలు లేదు. అదీ శరీరంలో కరచరణాదులలాగా ఒక భాగమే గనుక ఇది నాది అనట మసంభవం. అప్పటికిది నాది అనాలంటే దీనికది తప్పకుండా వేరయి ఉండాలి. ఏమిటది. శరీరం కాదు. మనఃప్రాణాది కరణ వర్గమూ కాదు. ఇదంతా దానికి జ్ఞేయమైన పదార్ధం. కాగా అది దీన్ని గ్రహిస్తున్న పదార్థం కాబట్టి జ్ఞేయం కాదు.