#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ధర్మ సాధన మన్నారు. ప్రవృత్తి నివృత్తి ధర్మాలకు రెండింటికీ అదే సాధనం. కాబట్టి వీడి అనుభవానికి కావలసిన విషయమనే సామగ్రి గానూ ప్రకృతే సృష్టి అయింది. దాన్ని అనుభవించే కార్యకరణ రూపమైన సంఘాతంగానూ అదే పరిణమించింది. అలా పరిణమించిన ఈ సంఘాతానికే Constitu-tion శరీరమని పేరు. దీనినే ఇప్పుడు క్షేత్రమని నిర్దేశిస్తున్నది గీత అని భాష్యకారులు వ్యాఖ్యానిస్తున్నారు.

  అయితే శరీరమన కుండా దీన్ని క్షేత్రమని ఎందుకన్నారు అని అడిగితే దానికి సంజాయిషీ ఇస్తున్నాడాయన. క్షి అనే ధాతువు Root నుంచి వచ్చింది క్షేత్రమనే మాట. క్షి అనే ధాతువుకు మూడర్ధాలున్నాయి. ఒకటి క్షతం. మరొకటి క్షయం. ఇంకొకటి క్షరణం. క్షతమంటే దెబ్బ. దెబ్బ తగులకుండా త్ర కాపాడుతుంది కాబట్టి క్షేత్ర మన్నారు శరీరాన్ని. అలాగే ఎంత కాపాడినా క్షయమై పోతుంది కాబట్టి కూడా క్షేత్రమన్నారు. క్షీణించటమే గాక క్షరణ అంటే సడలిపోయి అసలు కనపడకుండా నశించి పోతుంది కాబట్టి కూడా క్షేత్రమని పేరు వచ్చిందట దీనికి. ఇలా ధాత్వర్థం చెప్పటమే గాక మరొక మాట కూడా అన్నారాయన. క్షేత్రం లాంటిది గూడా గనుక దీనికి క్షేత్రమని పేరు వచ్చిందట. క్షేత్రమేమిటి. క్షేత్రమంటే పొలం. పొలంలో విత్తనాలు చల్లితే అవి నెమ్మదిగా పైకి వచ్చి పైరయి అది ఎలా మనకు పంటగా చేతికి వస్తోందో - అలాగే కర్మ బీజాలు నాటితే ఇందులో ఇది సుఖదుఃఖాలనే ఫలాన్ని మన అనుభవానికి తెస్తుంది కాబట్టి ఇదీ ఒక క్షేత్రం లాంటిదే ఈ శరీరం.