#


Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

కాబట్టి రెండు కావవి వాస్తవంలో ఒకటే. అందులో జ్ఞాన స్వరూపమైన ఆత్మే వస్తువు. దాని ప్రకృతే అంతకంతకు చలించి జీవజగత్తులుగా భాసిస్తే అనాత్మ. దాని విభూతి. కాగా ఈ విభూతి ద్వారానే మనమిప్పుడా ఈశ్వరుడనే ఆత్మ స్వరూపాన్ని దర్శించాలి. అదే తత్త్వమసిలో అసి పదార్ధం. అది ఎలాగో దాన్ని సాంగోపాంగంగా మనకు బోధ చేయటానికే వచ్చిందీ క్షేత్రజ్ఞాధ్యాయం.

ఇదం శరీరం కౌంతేయ - క్షేత్ర మిత్యభి ధీయతే
ఏత ద్యో వేత్తి తం ప్రాహుః - క్షేత్రజ్ఞ ఇతి తద్విదః - 1

  ముందుగా క్షేత్ర మేమిటో క్షేత్రజ్ఞుడంటే ఏమిటో ఆ మాటల కర్ధమేమిటో వివరిస్తున్నాడు మహర్షి ఇదం శరీరం క్షేత్రమితి అభిధీయతే. ఇదుగో ఈ కనిపించే శరీరానికే క్షేత్రమని పేరు. శరీరమంటే ఏమిటి. అది ఎలా తయారయిందసలు. ప్రకృతి శ్చ త్రిగుణాత్మికా సర్వ కార్య విషయా కారేణ పరిణతా. త్రిగుణాత్మకమైన అపరా ప్రకృతి ఏదుందో అదే శరీర మనః ప్రాణాది రూపంగా అలాగే బాహ్యమైన విషయ ప్రపంచంగా పరిణమించిందని గదా పేర్కొన్నాము. పురుష స్య భోగా పవర్గార్థ కర్తవ్యతయా. అదే ఈ మానవుడు భోగ మోక్షాలనేవి అనుభవించటం కోసమని దేహేంద్రియాద్యాకారేణ సంహన్యతే. మానవుడికి కావలసింది ఒకటి శబ్ద స్పర్శాదుల వల్ల కలిగే సుఖానుభవం మరొకటి సుఖ దుః ఖాదుల కతీతమైన మోక్షానుభవం. ఇవే భోగా పవర్గాలు. ఇందులో ఏది సాధించాలన్నా శరీర మనేది ఒకటి ఉండి తీరాలి. శరీర మాద్యంఖలు