పదార్ధాలు. ఇవే ఆత్మా నాత్మలనేవి. జ్ఞానమాత్మ. జ్ఞేయ మనాత్మ. అంతవరకే అయితే అది ద్వైతం. అందులో జ్ఞేయమనేది ఏదో గాదు. అఖండమైన జ్ఞానమే చలించి ఖండమైతే అది జ్ఞేయమని భావిస్తే ద్వైతం. ఇదుగో ఈ చలనమే కర్మ. అచలమైనది జ్ఞానం. దాని చలనం కర్మ. ఇప్పుడు సాంఖ్యయోగ కర్మయోగా లర్ధమయ్యాయి మనకు. సాంఖ్యమనేది జ్ఞానం. కర్మ అనేది దాని చలనం లేదా ప్రసరణ. రెండూ ఒకటే. అంటే ఆత్మా నాత్మలు రెండూ ఆత్మే. ఒకటి స్వరూపం. మరొకటి దాని విభూతి Ex-pansion. అవే జ్ఞాన విజ్ఞానాలుగా దర్శనమిస్తున్నాయి మనకు సప్తమాధ్యాయంలో. అందులో జ్ఞానమీశ్వరుడు. ఆయన పరాపర ప్రకృతులు రెండూ విజ్ఞానం. అంటే దాన్ని అనుభవానికి తెచ్చుకోటానికి తోడ్పడే సాధన ద్వయ మనుకోండి.
పోతే మరలా ఇదే రాజ విద్యా రాజ గుహ్యమనే తొమ్మిదవ అధ్యాయంలో పునరావృత్తమయి కనిపిస్తుంది. అక్కడ రాజ విద్య ఏదో గాదు జ్ఞానం. రాజగుహ్యం దాని అనుభవం. దేని ద్వారా రావాలా అనుభవం. జ్ఞాన ప్రసరణ ద్వారానే గదా. ఆ ప్రసరణే కర్మ. అలాగే మరలా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞులనే పదమూడవ అధ్యాయంలో కడసారిగా సాక్షాత్కరిస్తున్నది మరొక రూపంలో. క్షేత్రజ్ఞుడెవరో గాదు. జ్ఞానమే. క్షేత్ర మా జ్ఞానంలో నుంచి ప్రసరిస్తూ వచ్చిన కర్మే. అదే ఆలోచనాత్మకంగా చలిస్తూ జీవుడిలోనూ . పరిణామాత్మకంగా చలిస్తూ బాహ్య జగత్తులోనూ గోచరిస్తున్నది. ఇంతకూ తేలిన దేమంటే జ్ఞానమూ కర్మా రెండే మాటలు. జ్ఞాన ప్రసారమే కర్మ.