గాదు సూర్యమండలం నుంచే వచ్చిందని చెప్పటమెందుకంటే వెలుగుతో కూడిన మండలమే ఉంది వెలుగు దానికి వేరుగా లేదని గ్రహించటానికే. అలాగే ఈశ్వరుడి నుంచే ఈ చరా చర జగత్తు సృష్టి అయిందని వర్ణించట మెందుకంటే ఇలా విస్తరించి కనిపిస్తున్నది గాని ఇది దానికన్నా వేరుగా లేదు ఉన్నదదే నని గుర్తించటానికే. అలాగే ఆ ఈశ్వరుడే జీవరూపంగా మన బుద్ధిలో ప్రవేశించాడని పేర్కొనటం కూడా ఈ జీవుడా ఈశ్వర చైతన్యమే సుమా మరేదీ గాదనే దృష్టి పెట్టుకొని చూడమని మనబోటి జీవులకు బోధించటానికే. ఇదీ భగవత్పాదులు సూత్రప్రాయంగా చెప్పిన వాక్యాన్ని సాగదీస్తే మనకు స్ఫురించే సారాంశం. క్షేత్ర క్షేత్రజ్ఞులంటే జీవజగత్తులే. అవే పరాపర ప్రకృతులంటున్నా రాయన. అవి రెండూ వర్ణించట మెందుకంటే వాటిని రెండింటినీ నిరూపణ ద్వారేణ చక్కగా తరచి చూస్తే తద్వతః ఈశ్వరస్య. అవి రెండూ ఎవరి స్వభావమో అలాటి ఈశ్వర తత్త్వాన్ని నిర్ధారణార్ధం. ఇదమిత్థమని నిశ్చయించుకోవచ్చునట.
ఇప్పుడు మనం మొదట చెప్పుకొన్న జంట నామాలకు కూడా అర్థం తెలిసిపోయింది. ఏమిటా జంట. క్షేత్ర క్షేత్రజ్ఞులనేది ఈ అధ్యాయానికి పెట్టిన జంట నామం. చెప్పాము గదా క్షేత్రజ్ఞుడంటే జీవుడు క్షేత్రమంటే శరీరమని. ఇది రాజ విద్యా రాజ గుహ్యమనే తొమ్మిదవ అధ్యాయ నామానికి ప్రత్యామ్నాయం. అది జ్ఞాన విజ్ఞానాలనే సప్తమాధ్యాయానికి. అది సాంఖ్యయోగ కర్మయోగాలకూ ప్రత్యామ్నాయమని గదా మనం చెప్పుకొన్న మాట. అసలు విషయమేమంటే జ్ఞానమూ జ్ఞేయమూ రెండే ఉన్నాయి