#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము



  అయితే ఇంతకూ ఏమిటా పదమెలా ఉంటుందది – చెబుతున్నాడు మహర్షి తమేవ చాద్యం పురుషం ప్రపద్యే - యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. ఆద్యుడైన పురుషతత్త్వ మట అది. పురుష అంటే పూర్ణమైన స్వరూపం. తాను తానుగా ఉంటూ మిగతా దానినంతా వ్యాపించే దేదో అదీ పూర్ణమనే మాట కర్థం. తానుగా ఉంటే స్వరూపం. మిగతాది కూడా వ్యాపిస్తే అది దాని విభూతి. ఆ మిగతాదే జీవుడూ ఈశ్వరుడూ జగత్తూ. ఇవి కూడా పురుషులేనని పేర్కొంటుంది భగవద్గీత. పురి శయనాత్పురుషః శరీరమనే పురంలో వచ్చి కూచొని ఇక్కడ చిక్కుబడ్డాడు జీవుడు. ఆ దృష్టితో వీడూ పురుషుడే. అలా కాక విశ్వ శరీరాన్నంతా పూరణాత్ పూరించాడు. నిండిపోయాడు ఈశ్వరుడు. కనుక ఆ దృష్టితో వాడూ పురుషుడే. కాని ఏమి ప్రయోజనం. ఆ మేరకే పురుషులు గాని పూర్ణ పురుషులు కారు వారు. స్వరూప విభూతులు రెండూ వ్యాపిస్తే వాడు పూర్ణ పురుషుడు. కనుకనే వాడాద్యుడు. వీరందరికీ ముందున్నవాడు. మూలమైన తత్త్వం. ఊర్ధ్వమూలమని గదా వర్ణించాడు. మూలం నుంచే మిగతాదంతా ఏర్పడుతుంది. అన్నిటికీ మూలమైనదిక దేనివల్లా ఏర్పడేది కాదు. కనుకనే ఆద్యమది - Origin of all.

  ఇలాటి ఆద్యమూ పూర్ణమూ అయిన దెక్కడ ఉందని. ఎక్కడో ఉందని ఊహించినంతవరకూ అది మన సొమ్ము గాదు. పరోక్షంగానే ఉండిపోతుంది

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు