దేనితో సంబంధం లేని వైరాగ్య బుద్ధి. అదే పెద్ద గండ్ర గొడ్డలి. అది దృఢంగా ఉంటే చాలు. ఎంత వేరు దన్నిన వృక్షమైనా దెబ్బ మీద దెబ్బ తగిలితే పడిపోవలసిందే. తప్పదు. అప్పటికి సంసార బంధాన్ని వైరాగ్యంతోనే వదిలించుకొని బయటపడాలి మానవుడు.
పడతాడు మంచిదే. ఇది ప్రతిలోమ క్రియే గాని అనులోమం కాదు గదా. అనులోమంగా Positive దీనికతీతమైన ఫలాన్ని సాధించినప్పుడే గదా దీనికర్థం. అప్పుడే గదా అది అనుభవం. ఒకటి లేకపోవట మనుభవ మెలా అవుతుందని ప్రశ్న. దీనికి సమాధానమే రెండవ శ్లోకం. తతః పదం తత్పరిమార్గి తవ్యం - యస్మిన్ గతా న నివర్తంతి భూయః అసంగ శస్త్రంతో ఈ వృక్షాన్ని నిర్మూలించిన తరువాత పరిమార్గితవ్యం. వెతుకుతూ పోవాలట. వెతకటమంటే వెతకటం కాదు. జ్ఞాతవ్యం. గుర్తించటమని అర్థం చెప్పారు స్వామివారు. వృక్షం వృక్షం కానట్టే గొడ్డలి గొడ్డలి కానట్టే వెతకటం కూడా వెతకటం కాదు. సంసార బంధం వైరాగ్య భావంతో వదలించుకొని తతః పదం. పరమ పదమైన బ్రహ్మతత్త్వాన్ని ఆకళించుకోవాలని తాత్పర్యం. అలా ఆకళించుకొన్నప్పుడే న ని వర్తంతి భూయః - మరలా జనన మరణాలనే బాధ లేదు మానవుడికి. సంసారమే లేనప్పుడిక ఇక్కడికి రాకపోక లేమున్నాయి. అదే మోక్షం. జీవితానికి చిట్టచివరి పరిష్కారం.