#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

ప్రారంభమయిందని ఎవరూ చెప్పలేరు. సంసారం కదా. సంసారమంటేనే ప్రవాహరూపంగా సాగిపోతున్నదని అర్థం. ఎక్కడ మొదలయిందో తెలియదు. అలాగే నాంతః ఎక్కడ అంతమవుతుందో కూడా తెలిసే విషయం కాదట. అంటే ఏమని అర్థం. అనాది అనంతమీ సంసారం. అజ్ఞానం వల్లనే మొదలయింది. అజ్ఞాన మున్నంత వరకూ ఉంటుంది. మరి అజ్ఞాన మెప్పటి నుంచీ ఉందనే ప్రశ్నే లేదు. అజ్ఞానాని కాది చెప్పారంటే అంతకు ముందున్న దేమిటని ప్రశ్న వస్తుంది. తప్పకుండా ఒప్పుకోవాలంతకు ముందది జ్ఞానమేనని. అంతకు ముందు జ్ఞానమే ఉంటే అది అజ్ఞానమెలా అయింది. అర్థం లేని మాట. అంచేత ఆది లేదు అజ్ఞానానికి. అలాగే అంతం కూడా లేదు. ఎవడికి జ్ఞానోదయమైతే వాడికే అది అంతమవుతుంది. కాని మనుష్యాణాం సహస్రేషు అని నూటికి కోటికే ఒక్కడికో ఆభాగ్యం. మిగతా తొంభయి తొమ్మిదీ అజ్ఞానులే. అంచేత వారి దృష్ట్యా ఎప్పుడూ ఉంటుంది అజ్ఞానం. అంచేత అంతం కూడా లేదు. మరి ఆద్యంతాలు లేని పదార్ధానికి మధ్యం మాత్ర మెలా ఉంటుంది. ఆదా వంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తథా అన్నారు గౌడపాదులు. కాబట్టి నాంతో చాదిర్నచ సంప్రతిష్ఠా. ఆద్యంతాలు లేవు. మధ్యమూ లేదు. అజ్ఞానానికి. అజ్ఞాన స్వరూపమే గదా సంసారం. దానికి లేవంటే దీనికి లేవనే అర్థం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు