#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

మనుష్యలోకే అంటున్నారు వ్యాస భగవానులు. మనుష్యలోకంలో కనిపించే వృక్షమిది. కనుక మనుష్యులకే దాని అనుభవం. వీరే మంచీ చెడ్డా కర్మలు చేస్తుంటారు. కర్మఫలం మరలా అనుభవిస్తుంటారు. మరి పశుపక్ష్యాదులో. అవీ ప్రాణులే గదా అవి చేయవా కర్మ. వాటికి లేదా ఫలానుభవం. చేస్తాయి. కర్మాను రూపమైన ఫలం కూడా ఉంది. కాని బుద్ధిపూర్వకంగా చేయవవి. వాసనా జ్ఞానమే గాని వివేక జ్ఞానం లేదు వాటికి. కనుక కర్మ చేసినా దానిఫలమైన సుఖదుఃఖాదు లనుభవించినా ఇదుగో ఈ పని నేను చేయబట్టి గదా ఈ బాధ లనుభవిస్తున్నాననే జ్ఞానం లేదు. అది ఉన్నవాడే మానవుడు. అవి కర్మజీవులైతే వీడు బుద్ధి జీవి. కనుకనే వీడి విషయమే పేర్కొనటం మహర్షి. అదైనా ఎందుకంటే ఇలాటి కర్మ చేయటం వల్ల గదా ఈ కష్టాలను భవించవలసి వచ్చింది. కనుక ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దుష్కర్మలను చేయగూడదు. చేయకూడదంటే అలాటి సంకల్పం కలగకూడదు. అది కలగరాదంటే దానికి మూలమైన అజ్ఞానం తొలగిపోవాలి. అది పోవాలంటే ఈ సంసార మిలా భాసించటానికేది మూలమో దాని నన్వేషించి పట్టుకొనే ఆత్మజ్ఞానం నేనార్జించాలనే దృఢమైన వైరాగ్యమూ తత్త్వ జిజ్ఞాసా మానవుడికి మరలా గుర్తు రావాలి. అందుకే దీనినింత వన్నె చిన్నెలు పెట్టి వర్ణించటం. వైరాగ్యహేతోః అని మొదటనే చెప్పారు భాష్యకారులది గుర్తు చేసుకోవాలి మనం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు