ప్రక్కలకు పోవచ్చు లేదా క్రిందికైనా రావచ్చు. అంతేగాని నిటారుగా దాని పైకి సాగిపో వెప్పుడూ. అయినా ఊర్థ్వముఖంగా కూడా పోతున్నాయని వర్ణిస్తున్నాడు వ్యాస మహర్షి అసలిది లోక సహజమైన వృక్షమైతే గదా. కాల్పనికమైన వృక్షమాయె. వృక్షమంటే వృక్షం లేదంటే లేదు. అందుకే అన్నీ వింతలే దీనిలో. వేరు పైనా కొమ్మలు క్రిందా ఉన్నాయని చెప్పటమొక వింత. అలాగే కొమ్మలు ప్రక్కలకే గాక పైకి కూడా వెళ్లిపోతాయని చెప్పటమింకొక వింత. అధశ్శాఖ మని ముందు చెప్పి ఇప్పుడూర్థ్వం ప్రసృతాః అంటున్నాడు చూడండి. ఇంతకూ ఏమిటా కొమ్మలిక్కడ. గుణ ప్రవృద్ధాః గుణాలతో బాగా పెరిగి పెద్దవయినాయి. త్రిగుణాలే ఆ కొమ్మలు. అందులో గుణాలు మూడైనా ఒకదానితో ఒకటి కలిసి రంగులలాగా సప్తస్వరాలలాగా అసంఖ్యాకమయి పోగలవు. అలాగే శాఖోపశాఖలుగా పెరిగిపోయిన త్రిగుణాలే శాఖలు దానికి.
పోతే ఇక రెమ్మలు. చిన్న చిన్న మండలు లేదా చిగుళ్ళు ఏమిటని ప్రశ్న వస్తే ఏవో గావవి. శబ్ద స్పర్శాదులైన విషయాలేనట. అంటే చరా చర పదార్ధాలన్నీ మన జ్ఞానాని కెప్పుడూ గోచరిస్తూనే ఉంటాయి గదా. జ్ఞానానికేది గోచరిస్తే అది దానికి విషయం Object. మొత్తానికి నామరూప క్రియాత్మకమైన ప్రపంచమంతా రెమ్మలు మండలూ చిగుళ్లూ ఈ వృక్షానికి ఇంకా ఏమిటో చెట్టులో ఉండే విశేషం. అదే చెబుతున్నాడు మహర్షి