ఆయన శక్తి ఏమిటో అర్థం చేసుకొని తరువాత అహో అక్కడి నుంచి వచ్చిందా ఈ సంసార మని ఇటువైపు చూడు. ముందు అటు వైపు చూచి దాన్ని ఆకళించుకొని తరువాత ఇటువైపు చూడాలి. ముందు బంగారమంటే ఏమిటో తెలుసుకొని తరువాత నగలూ నట్రా చూచినట్టు. అప్పుడు గాని ఇవి బంగారు ఆభరణాలని సమగ్రంగా తెలియదు నీకు. అలా కాక ఆభరణాలు మాత్రం చూచి సువర్ణాన్ని చూడకున్నా సుఖం లేదు. మరి సువర్ణాన్నే చూచి సొమ్ములు చూడకున్నా ప్రయోజనం లేదు. సువర్ణం స్వరూపమైతే సొమ్ములన్నీ దాని విభూతి. రెంటినీ కలిపి పట్టుకొంటేనే అది పరిపూర్ణమైన అనుభవం.
అలాగే సంసారాన్ని మాత్రం చూచి దీనిమూల మేమిటో అది మరచిపోతే ఏమి ప్రయోజనం. ఆ మూలమేమిటో గుర్తించాలి మొదట. అదేదో గాదు. శక్తిసహితమైన శివతత్త్వం. అదే ఈ చరాచర ప్రపంచానికంతా మూలకారణం. అక్కడినుంచే ఆవిర్భవించిందీ సమస్తమూ. ఇప్పుడీ కార్యకారణా లేమిటో రెండూ తెలుసుకొని రెంటికీ ఉన్న సంబంధమేమిటో తెలిస్తే చాలదా. ఆత్మానాత్మలు రెండూ తెలిసినట్టే. అప్పుడిక మనం తెలుసుకోవలసిందే ముంది. అదే చెబుతున్నారు గురువుగారు. అవశిష్టః నాస్తి మిగిలిందేమీ లేదని. కాకున్నా ఏముంటుంది మిగులు. మూడే అవి. జీవుడు జగత్తు ఈశ్వరుడు. ఇవి మూడూ మన జ్ఞానాని కెప్పుడూ జ్ఞేయమే Object to knowledge . జ్ఞేయమంతా సంసారం క్రిందికే వచ్చేసింది. దీనితోనే సతమత మయిపోతున్నారు