#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

బ్రహ్మవృక్ష స్సనాతనః - ఏతద్బహ్మవనం చైవ బ్రహ్మా చరతి నిత్యశః ఏత చ్ఛిత్వాచ భిత్వాచ - జ్ఞానేన పరమాసినా - తత శ్చాత్మ రతిం ప్రాప్య తస్మా న్నావర్తతే పునః - ఇదీ పురాణంలో వృక్షవర్ణన. మొత్తం మీద గీతా వృక్షమైనా పురాణ వృక్షమైనా కఠోపనిషత్తు నుంచి దిగుమతి అయిన వృక్షమే. దాన్ని ఎంతగా వర్ణించాలో అంత సాంగోపాంగంగా వర్ణిస్తూ భాష్యం వ్రాశారక్కడ భగవత్పాదులు.

  ఇంతకూ వృక్షమని ఎప్పుడన్నామో అప్పుడు దానికున్న హంగులన్నీ సంసార వృక్షానికి కూడా అన్వయించి చెప్పాలి గదా. అలాంటప్పుడు దీనికి మూలమేమిటి శాఖలేమిటి ఆకులేమిటని ప్రశ్న వస్తుంది. దానికి సమాధాన మిస్తున్నారు వ్యాస మహర్షి. ఊర్ధ్వమూల మధశ్శాఖమని. అవ్యక్త మూల ప్రభవమని గదా పురాణం వర్ణించింది. అదీ ఇదీ కలిపి చెబుతున్నారు. భాష్యకారులు దీనికి మూల మవ్యక్తమైన బ్రహ్మమేనని. మూలమంటే వేరని గదా అర్థం. వేరు నుంచే వస్తుంది వృక్షం. అలాగే మూలకారణమైన బ్రహ్మతత్త్వం నుంచే ఏర్పడిందిది. కేవలం బ్రహ్మమే అయితే అది కూటస్థం. పరిణమించలేదు. అంచేత మాయా శక్తి మత్తని వ్రాస్తున్నారు స్వామివారు. బ్రహ్మమే తన శక్తి ప్రభావం చేత సంసార వృక్షంగా భాసిస్తున్నదని భావం. శివశక్తులు రెండూ కలిసి దీనికి మూలం. అది దీనికి కారణం గనుక అతి సూక్ష్మమూ నిరాకారమూ గనుక ఊర్థ్వం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు