అని చక్కని వ్యుత్పత్తి చెప్పారు దానికాచార్యుల వారు. రేపటికి కూడా ఉంటుందో లేదో అంత క్షణభంగురమని అర్థమట. అశ్వత్థ శ్చలదళః అని నిఘంటువు. దాని ఆకులెప్పుడూ గాలి వీచినా లేకున్నా చలిస్తుంటాయి. అందుకే చలదళమని కూడా దానికి పేరు. నిజంగా ఈ సంసారం నిరంతర పరిణామ శీలం. కనుకనే సంసారమనే సంజ్ఞ దీనికి సార్థకంగా ఏర్పడింది. చలదళమైన రావిచెట్టెంతో ఇదీ అంతే గదా అప్పటికి. అశ్వత్థంతో సంసారాన్ని పోల్చి వర్ణించింది మొదట కఠోపనిషత్తు. అదే మూలం దీనికి. ఊర్ధ్వమూలః అవాక్మాఖః - ఏషోశ్వత్థ స్సనాతనః అని అక్కడ ఉపనిషత్తు. అలాగే వర్ణిస్తున్నది భగవద్గీత కూడా. అక్కడ సనాతన అంటే దానికి దీటుగా ఇక్కడ అవ్యయమన్నాడు. ఎప్పటికప్పుడు రూపం మారుతున్నా ఏదో ఒక రూపంలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. మన ప్రాణం తీస్తూనే ఉంటుందీ సంసారం. అందుకే ఇది సనాతనం అవ్యయం.
కఠోపనిషద్వాణి గీతలోనే గాక మనకింకా వ్యాస ప్రణీతమైన పురాణ వాఙ్మయంలో కూడా వినిపిస్తుంది. పురాణే అని భగవత్పాదులే ఉదాహరించారు తమ భాష్యంలో. అవ్యక్త మూల ప్రభవః తస్యైవాను గ్రహోచ్చితః - బుద్ధి స్కంధమయ శ్చైవ ఇంద్రియాంతర కోటరః మహాభూత విశాఖశ్చ విషయైః పత్ర వాం స్తధా - ధర్మా ధర్మసు పుష్పశ్చ సుఖ దుఃఖఫలోదయః ఆ జీవ్య స్సర్వ భూతానాం