గుర్తించక ఇదే బంగారమని దీన్ని బాగా పూసుకొని తిరుగుతున్నాము. దీనివల్ల కలిగే కష్టసుఖాలతో నిత్యమూ సతమతమయి పోతున్నాము. ఇది ఇలా సత్యమని భావించినంత వరకూ అసలైన సత్యమేదో అన్వేషించలేము. పట్టుకోలేము. పట్టుకోక పోతే ఏ జన్మకూ ముక్తి లేదు. అంచేత ఇది ఒక వృక్షం లాంటిదీ సంసారం. ఒక వృక్ష మెలా వానకు తడిసి ఎండ కెండి చివరకు తుపానుగాలి కెలా నేల కొరిగిపోతుందో - లేదా ఎవడైనా ఒక గొడ్డలి తీసుకొని నరికేస్తే సమూలంగా నశించి పోతుందో - అలాగే ఈ సంసారం కూడా చూస్తున్నంత వరకూ మనోహరంగా కనిపించినా ఎప్పటికో ఒకప్పటికి మనకు దక్కకుండా పోయేదే సుమా అని ఒక గొప్ప హెచ్చరిక ఇది. విరక్తస్యహి సంసారాత్ భగవ త్తత్త్వజ్ఞానే ధికారః నాన్యస్య. ఇలా క్షణ భంగురమీ సంసారమని దీని నుంచి మనసు మళ్లించిన విరక్తుడే భగవత్తత్త్వ జ్ఞానాని కధికారి గాని దీనిలోనే పడి ఇదే బంగారమని భావించే పామరుడికి గాదని ఇంతకూ భగవత్పాదులు మనకందించే సందేశం.
ఊర్థ్వ మూల మధశ్శాఖ - మశ్వత్థం ప్రాహు రవ్యయం
ఛందాంసి యస్యపర్ణాని - యస్తం వేద స వేదవిత్ - 1
అందుకోసమే ఒక వృక్షంతో పోల్చి చెబుతున్నాడీ సంసారాన్ని. చిలువలు పలువలు పెట్టి ఒక కథ చెప్పినట్టు చెబుతున్నాడు. వ్యాసభట్టారకుడు. ఏమిటా వృక్షమింతకూ. అశ్వత్థం ప్రాహు రవ్యయం. అశ్వత్థ వృక్షమట అది. అశ్వత్థమంటే రావిచెట్టు. శ్వోపిన స్థాతా అశ్వత్థః