దైనా పంచిపెట్టగలడు. కాని ఎవరైతే భక్తియోగేన మాంసేవతే - తే మమ ప్రసాదాత్ జ్ఞాన ప్రాప్తి క్రమేణ గుణాతీతాః మోక్షం గచ్ఛంతి. భక్తి యోగంతో నన్ను సేవిస్తారో వారు నా అనుగ్రహంతో జ్ఞానాన్ని ఆర్జించి గుణాతీతులయి క్రమంగా మోక్షాన్ని పొందుతారు. క్రమంగా అనే మాట విన్నారా. జ్ఞానులలాగా సాక్షాత్తుగా గాక భక్తులు జ్ఞానం ద్వారా క్రమంగానే పొందవలసి ఉంటుంది మోక్షఫలం. దీనికే సగుణ భక్తి అని పేరు. నిర్గుణం కాదిది. సగుణం. సగుణ మనటంలోనే ఉంది లొసుగు. గుణంతో చేర్చి పట్టుకొంటున్నాడు వీడు పరమాత్మను. సత్త్వమైనా అదీ ఒక గుణమే. గుణాలంటే నామరూపాలే గదా. అవి నీకన్యంగా చూపుతాయి పరమాత్మను. అనన్యంగా చూడనంత వరకూ అది మోక్ష మివ్వదు.
కనుక అనన్యమైన భక్తినల వరుచుకోవాలి సగుణ భక్తుడు. అంతవరకూ అభ్యాసం తప్పదు వాడికి. ఒక హిమాలయ మెక్కటం లాంటిదిది. ఎన్నో శిఖరాలుంటాయి పర్వతానికి. ఒక్కొక్క శిఖరమెక్కుతూ పోతే గాని చివరకు ఎవరెస్టనే పెద్ద శిఖర మారోహించలేడు. అలా కాక కొంతవరకే ఎక్కి అక్కడికే ఆగిపోయి అదే ఎవరెస్టను కొంటే ఎలా. ఫలితమే ముంది. ఎవరెస్టెక్కిన ఫలితముండదు. అలాగే భక్తి ఎంత గొప్పదైనా అది జ్ఞానంగా మారితే గాని మోక్షఫల మివ్వదు మానవుడికి. అంతవరకూ కర్మ భక్తి యోగాదు లభ్యసిస్తూ పోవలసిందే. ఎవరెస్టు చేరే వరకూ పర్వతారోహణ ఎలా చేస్తూ పోవాలో అలాంటిదే ఈ సాధన. జ్ఞానా దేవతు కైవల్య మన్నారు. కర్మాదుల వల్ల అప్పుడే వచ్చి ఒళ్లో బడేది గాదు.