ఏ వేషమైనా వేయవచ్చు. అదేదీ వేయకపోతే పరమాత్మ. గుణత్రయ మప్పుడు నిర్వ్యాపారంగా ఉంటుంది. దానికే పనిపెట్టి ఒక ఉపాధి ధరించి వస్తే వాడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే కృష్ణుడు.
మరి ఈ అర్జునుడో. వీడు గుణత్రయాని కధీనుడై బ్రతుకుతున్నాడు. అతిక్రమించటానికి నోచుకోలే దింకా. అలాటి అనుభవం లేదు. కనుక ఈశ్వరత్వం లేదు. వీడికున్నది నరత్వమే. నారాయణత్వం కాదు. కాబట్టి వీడు మరలా నరత్వం పోగొట్టుకొని నారాయణు డనిపించుకోవాలంటే ఒకటే షరతు. మాంతు యో వ్యభిచారేణ. వీడు పరమాత్మ నెప్పుడు పట్టుకొంటాడో అప్పుడే గుణత్రయానికి స్వస్తి చెప్పి నారాయణత్వం పొందగలడు. మరి ఆ పట్టుకొనే మార్గ మేమిటని అడిగితే సెలవిచ్చాడు అవ్యభి చారేణ భక్తి యోగేన అని. ఇది రెండవ మాట. అవ్యభిచారమైన భక్తి అంటే అనన్యమైన భక్తి. కేవలం సచ్చిదాత్మకమైన ఆత్మజ్ఞానం.
ఇవి రెండూ గుణత్రయాధ్యాయంలో మనం చివరిసారిగా విన్న రెండు విలువైన మాటలు. ఆ అధ్యాయాని కంతా అదే సారభూత మైనది. దానినే ఇప్పుడు బాగా మనకు వివరించి చెప్పటానికి వస్తున్నదీ పదిహేనవ అధ్యాయం. ఇదే పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఎవడీ పురుషోత్తముడు. అక్కడ మాం అన్నాడు చూడండి వేదవ్యాసుడు నన్నెవడు పట్టుకొంటాడోనని. ఆ నేనే పురుషోత్తము డంటే. ఉత్తముడైన పురుషుడే పురుషోత్తముడు. అయితే ఉత్తములు కాని పురుషులు కూడా ఉన్నారా. ఉన్నారిద్దరు. ఒకడు క్షర పురుషుడు. మరొక డక్షర పురుషుడు. అవి తరువాత చెప్పబోతారాయన.