#


Index

పురుషోత్తమ ప్రాప్తి యోగము

గుణత్రయాన్ని దాటిపో. పొమ్మనే చెబుతున్నది గీత. ఎవడైతే గుణత్రయాన్ని దాటిపోతాడో వాడే క్షేమంగా బతికి బయటపడతాడని.

  గుణత్రయా తీతమైన దశ ఏది ఉందో అది కేవల మాత్మ స్వరూపం. అంతవరకే మనకీ శరీరాద్యుపాధులు కనిపిస్తుంటాయి. అవి దాటిపోయినప్పుడే నిరుపాధికమైన మన స్వరూపం మనకు సాక్షాత్కరిస్తుంది. అది పరమాత్మ అను. ప్రత్యగాత్మ అను. బ్రహ్మమను. ఈశ్వరుడను. ఏ పేరయినా పెట్టు. మొత్తం మీద గుణత్రయాని కతీతమైన దశ ఏదో అది అందుకోవాలి మనం. అది ఎలా లభిస్తుందని అడిగితే సెలవిచ్చాడు కృష్ణుడు. ఏమని. మాంతు యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే అని. ఇది బంగారం లాటి మాట. ఎవడైతే నన్ను అవ్యభిచారి అయిన భక్తితో పట్టుకొంటాడో వాడు దాటి పోగలడీ గుణత్రయం. వాడికిక సంసార బాధలూ బంధాలూ లేవు. అని ఆశీర్వదించాడు.

  అక్కడ రెండు మాటలున్నాయి. మొదటిది నన్ను పట్టుకోవాలనే మాట. నన్ను అంటే ఎవరా నేను కృష్ణుడా. కృష్ణుడు కాదు. కృష్ణుడికి మూలవిరాట్. కృష్ణుడి మూల విరాట్ మన మూల విరాట్ కూడా. ఎందుకంటే గుణత్రయం దాటిపోయిన తత్త్వమొక్కటే ఉంటుంది. రెండు మూడుండవు. అది కృష్ణుడి కొకటి మనకొకటి కాదు. అది పరిశుద్ధమైన చైతన్యం. అస్తిభాతి. అది కృష్ణుడికీ ఉంది మనకూ ఉంది. కృష్ణుడేమి చేశాడు. గుణత్రయాన్ని తన కధీనం చేసుకొని వచ్చాడు లోకంలోకి. అది అవతారం. మన మలా కాక దాని కధీనులమయి వచ్చామిక్కడికి. దాటినవాడే పాటయినా పడవచ్చు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు