15. పురుషోత్తమ ప్రాప్తి యోగము
గుణత్రయ విభాగ యోగమయింది. ప్రస్తుతం పురుషోత్తమ ప్రాప్తియోగమనే పదిహేనవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. గుణత్రయానికీ దీనికీ ఏమిటి సంబంధం. గుణత్రయ మనేది మన కనర్థ దాయకం. సంసారంలో పడగొట్టినవీ మూడు గుణాలే మనలను. సత్త్వం కూడా పనికిరానిదే. రజస్తమస్సుల కంటే గొప్పదైనా గుణం గుణమే. గుణమనే దున్నంత వరకూ సంసార బంధం తప్పదు. ఒకటి ఇనప సంకెళ్లైతే మరొకటి బంగారు సంకెళ్లని చెప్పాను గదా. సంకెళ్ళు చేసే పనేమిటి. కట్టి పారేయటం. రజస్తమస్సు లెలా కట్టేస్తాయో సత్త్వం కూడా అలాగే కట్టేస్తుంది. కనుక ఈ బందిఖానాలో నుంచి తప్పించుకోవాలంటే ప్రకృతి గుణాలు దగ్గర పెట్టుకొని సుఖం లేదు. మరేమి చేయాలంటారు.