అమృతస్య - అవ్యయస్య - అమృతమూ అవ్యయమూ అని గదా. ఎప్పటికీ నశించనిది అమృతం. ఎప్పుడూ మారిపోనిది అవ్యయం. అలాగే శాశ్వతస్య ధర్మస్య - శాశ్వతమైన ధర్మమది. అంటే ప్రవృత్తి రూపం కాదు. నివృత్తి రూపమైన ధర్మం. మోక్షమని అర్థం. మోక్ష స్వరూపమే పరమాత్మ. పరమాత్మకు మోక్షానికీ తేడాలేదు. అలాగే సుఖస్యై కాంతికస్య. ఐకాంతికమైన సుఖమే పరమాత్మ. నిత్యానంద స్వరూపుడు.
ఇలాటి పరమాత్మ లక్షణాలన్నీ ఎక్కడ ఉన్నాయిప్పుడు. ప్రత్యగాత్మలోనే. ప్రత్యగాత్మ భావిస్తున్నవే గదా ఈ లక్షణాలన్నీ. ప్రత్యగాత్మ భావించకపోతే పరమాత్మ ఎక్కడున్నాడు. మన భావంలోనే ఉన్నాడు. అంటే బ్రహ్మాకారమైన చిత్తవృత్తిలోనే ఉంది బ్రహ్మం. బ్రహ్మమే వృత్తి రూపంగా మనలో ప్రవేశించింది. లేకుంటే ఆ ఆలోచన రాదు మనకు. ప్రమాణం మన ఆలోచన. ప్రమేయం దానికి గోచరించే బ్రహ్మం. సమ్యగ్ జ్ఞానేన పరమాత్మ తయా నిశ్చీయతే అని పేర్కొంటారు భాష్యకారులు.
అంతేకాదు. ఇంకా ఒక గొప్ప మాట అన్నారాయన. యయా చేశ్వరశక్త్యా భక్తానుగ్రహాది ప్రయోజనాయ బ్రహ్మ ప్రతిష్ఠతే ప్రవర్తతే సాశక్తి ర్రహ్మైవాహం. శక్తి శక్తిమతో రనన్యత్వాత్. బ్రహ్మమే తన మాయా శక్తిని వశం చేసుకొని ఈశ్వరుడయి ప్రవర్తిస్తున్నాడంటే ఆ శక్తి బ్రహ్మమైతే ఆ బ్రహ్మమే నేను - శక్తి శక్తిమంతులకు తేడా ఏముంది.