ఏదీ లేదనే అఖండ వృత్తే అవ్యభిచారి అయిన భక్తియోగం. యస్సేవతే. అలాటి భావంతో ఎవడు నన్ను సేవిస్తాడో. సగుణాన తీత్య త్రీన్. వాడే ఈ మూడు గుణాలనూ దాటి బయట పడగల డంటాడు పరమాత్మ. బ్రహ్మ భూయాయ కల్పతే. బ్రహ్మసాయుజ్యానికి కూడా వాడే నోచుకొంటాడు. అంటే ముక్తు డవుతాడని భావం. ఇంతకూ భక్తి యోగమే సాధనం. మానవుడు చేయవలసిన ఏకైక ప్రయత్నం. అదీ మామూలు భక్తి కాదు అవ్యభిచారి. అంటే జ్ఞాన నిష్ఠా రూపమైన నిర్గుణ భక్తి. ఆయా నామ రూపాది విశేషాలను గాక వాటన్నిటినీ వ్యాపించిన సచ్చిత్తులనే నిరంతరమూ దర్శిస్తూ పోవటం. సచ్చిద్రూపమే బ్రహ్మం గనుక యద్భావస్తద్భవతి అన్నట్టు వాడు బ్రహ్మాన్నే చేరగలడు. గుణాతీతుడే అనిపించుకోగలడు.
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహ - మమృత స్యావ్యయ స్యచ
శాశ్వత స్యచ ధర్మస్య- సుఖ స్యైకాంతి కస్యచ - 27
గుణాతీత లక్షణమయింది. గుణాతీతత్వ సాధన మయింది. అంతా అయిన తరువాత ఇప్పుడు చివరిసారిగా ఒక అద్భుతమైన అద్వైత రహస్యాన్ని బయటపెడుతున్నది మనకు భగవద్గీత. బ్రహ్మణోహి ప్రతిష్ఠాహం. అసలు బ్రహ్మం బ్రహ్మ మంటున్నావు. బ్రహ్మమనేది ఎక్కడ ఉంది. ఆ మాటకు వస్తే అది నేనే . నా స్వరూపమే. ప్రత్యగాత్మే పరమాత్మ. పరమాత్మకు ప్రత్యగాత్మే ఆశ్రయం. ఎలాంటిదని వర్ణించారు పరమాత్మను పెద్దలు.