#


Index

గుణత్రయ విభాగ యోగము

  అంతేకాదు. గుణాతీతుడి వ్యవహారమింకా చెప్పుకోవచ్చు మనం. మానాపమానయో స్తుల్యః తనకెవరి వల్లనైనా సమ్మానం జరిగినా అవమానం జరిగినా రెండూ ఒకటే వాడికి. చలించడు. అలాగే తుల్యోమిత్రారి పక్షయోః - మిత్రుడూ శత్రువని లేరు వాడికి. ఇద్దరూ సమానమే. ఇది ఉదాసీనవత్తనే మాటలో ఇంతకు ముందే కలిసి వచ్చింది గదా అంటే భగవత్పాదులు రెంటికీ కొంచెం తేడా చెబుతారు. యద్యపి ఉదాసీనా భవంతి కేచిత్ స్వాభిప్రాయేణ తధాపి పరాభిప్రాయేణ మిత్రారి పక్షయోరివ భవంతి. ఇతి తుల్యో మిత్రారి పక్షయోః - తన దృష్టిలో తాను ఉదాసీనుడైనా గుణాతీతు డితరుల దృష్టి కెవరి పక్షమో ఒకరి పక్షం వాడవ లంబించినట్టు కనిపించవచ్చు. అది కూడా లేదని చెప్పటానికి తుల్యోమిత్రారి పక్షయోః అని మరలా పేర్కొన వలసి వచ్చిందట.

  సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః ఉచ్యతే. ఇంతకూ పిండితార్థ మేమంటే శాస్త్రం బోధించిన ఐహికా ముష్మిక కర్మ లేవీ పెట్టుకోరాదు గుణాతీతుడైన వాడు. అన్నీ నిర్మొహమాటంగా వదిలేయాలి. అయితే ప్రారబ్ధం కొద్దీ బ్రతుకు తెరువనేది తప్పదు కాబట్టి దానికి కావలసినంత వరకూ అన్నపానాది కర్మలు మాత్రమే పాటిస్తుండాలి. దేహ యాత్రకు కావలసిన నిత్యావసరాలను మించి ఏ కర్మ చేసినా తప్పేనంటారు భాష్యకారులు. అలాగైతేనే వాడు గుణాతీడని పించుకొంటాడు.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు