మానాపమానయో స్తుల్య -స్తుల్యో మిత్రారి పక్షయోః
సర్వారంభ పరిత్యాగీ - గుణాతీతస్స ఉచ్యతే - 25
ఇప్పుడీ రెండు శ్లోకాలలోనూ ముందు పేర్కొన్న గుణాతీతుడి ప్రవర్తననే వర్ణిస్తున్నాడు మహర్షి. సమ దుఃఖ సుఖః - సుఖదుఃఖాలనే ద్వంద్వాలలో ఎప్పుడేది తనకు ప్రాప్తించినా వాటి రెండింటినీ సమానంగా చూస్తూ పోతాడు వాడు. పొంగిపోడు. కుంగిపోడు. అదెప్పుడు ఉండగలడు. స్వస్థః - తనలో తానున్నప్పుడే. వాటిని తనలో చేర్చుకొని చూడాలి గాని వాటిలో తాను పడిపోగూడదు. పడితే వాడు గుణాతీతుడు కాడు. గుణాధీనుడు. అతీతుడు గనుకనే సమలోష్టాశ్మ కాంచనః - మట్టీ రాయీ బంగారమూ అన్నీ ఒకటే వాడి దృష్టికి. ఇది విలువైనది దగ్గర ఉంచుకొందాం. అది పనికి రానిది దాన్ని దూరంగా పారేద్దామనే భావముండదు జ్ఞానికి.
అలాగే తుల్యప్రియా ప్రియః ధీరః - ఒకరు తన్ను పొగడినా అది తనకు ప్రియమను కోడు. తెగడినా తనకది అప్రియమను కోడు. తుల్యనిందా స్తుతిః నిందా స్తుతులు రెండూ సమానమే వాడికి. ఏదీ అనుకూలమని చూడడు. దేన్నీ ప్రతికూలమని భావించడు. ధీరః అయితే దానికెంతో ధైర్యం కావాలి. నిర్వికారమైన చిత్త వృత్తికే ధైర్యమని పేరు. అది గుణాతీతుడికే సాధ్యం.