#


Index

గుణత్రయ విభాగ యోగము

అనుభవానికి రాకుంటే రేపు మరణానంతరం వస్తుందని గారంటీ ఏమిటి. దేనికైనా అనుభవమే ప్రమాణం. అనుభవానికి రాని సిద్ధాంతం సిద్ధాంతమే కేవలం. దృష్టాంతం కాదు.

  ఇంతకూ ఏమిటి మనం చేయవలసిన సాధన. మన జీవితంలో ఏ ఆలోచన చేస్తున్నా - ఏమి మాటాడుతున్నా కరచరణాదులతో ఏ పని చేస్తున్నా - నేను నేనుగా ఏదీ చేయటం లేదు - ఆచేస్తున్నది నా గుణాలే గుణాలే గుణాలతో సంబంధం పెట్టుకొంటున్నాయి. అలా అవీ ఇవీ లావాదేవీ పెట్టుకొని సతమత మవుతుంటే నేనీ కలాపాని కంతా కేవలం సాక్షిమాత్రడనే నని అనుక్షణమూ మన సాక్షి చైతన్యాన్ని మనం గుర్తు చేసుకొంటూ - అవి చేస్తుంటే నేను చేయటం గాదని చూస్తుండాలి. ఇదే ఇంతకు ముందు అధ్యాయాలలో మహర్షి చాటి చెప్పారు. గుణా గుణేషు వర్తంతే – నైవకించి త్కరోమి అని. ఏ పని జరుగుతున్నా గుణాలే గుణాలతో వ్యవహరిస్తున్నా యంటాడు. గుణా గుణాలని రెండుసార్లు వచ్చింది మాట. మొదటిది మనః ప్రాణేంద్రియాలని రెండవది బాహ్యమైన శబ్ద స్పర్శాది విషయాలని అర్థం చేసుకోవాలి. కార్యకరణ విషయాకారంగా పరిణమించింది ప్రకృతి గుణాలనే గదా భాష్యకారులు చాటి చెప్పిన మాట. అంచేత రెండు చోట్లా గుణాల వ్యవహారమే. మరేదీ గాదు. ఇదుగో ఇలా నిర్లిప్తమైన సాక్షి భావమే మనం సాధించి పట్టుకోవలసింది.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు