ఇవేవో ఉన్నాయని భ్రమపడుతున్నామే కాని వాస్తవంలో ఇవేవీ లేవీ గుణాలు.
అందుకే వీటిని కాదనుకొనే జ్ఞాన ముదయిస్తే చాలు. అలాటి జ్ఞాన
ప్రకాశంలో ఇవేవీ కనపడవు. అవి కూడా మన స్వరూపంగానే
దర్శనమిస్తాయి. అదే అతీత్య దాటి పోవటమనే మాట కర్థం. అలా
దాటిపోతే వాడిక వామనుడు గాడు. త్రివిక్రముడే. త్రిగుణాల నతిక్రమించి
పోవటమే త్రివిక్రమత్వం. అప్పుడే అన్ని లోకాలనూ వ్యాపించి సర్వవ్యాపక
మవుతుంది మన జ్ఞానం. అనాత్మ రూపకమైన అసుర సంపద నణగ
ద్రొక్కుతుంది. అంత వరకూ వామనమే. అంటే శరీర మాత్ర పరిచ్ఛిన్నమయి
కూచుంటుంది. అందుకే త్రిగుణాలనూ దాటిపోవా లెప్పటికైనా. పోతే
అప్పుడే మవుతుంది. ఏమిటి దాని వల్ల మనకు కలిగే ప్రయోజనం.
చెబుతున్నారు వినండి. జన్మ మృత్యుజరా దుఃఖై ర్విముక్తః జనన
మరణాలనే విష వలయంలో నుంచి ఈ మానవుడు బయట పడట మొకటి.
ఇది ప్రతి లోమ ఫలమైతే అనులోమంగా కలిగే ఫలిత మొకటున్నది.
అమృతమశ్నుతే. ఇక మరలా మృతి అనే సమస్యలేని అమృతమైన దశనే
అందుకోగలడు. అది కూడా ఎప్పుడో దేహపాతమైన తరువాత గాదు.
జీవన్నేవ విముక్తః అని చాటుతారు భగవత్పాదులు. జీవించి ఉండగానే
చవిచూడవచ్చునట ఆఫలం ఎందుకంటే మానవుడు జీవించినప్పుడే