#


Index

గుణత్రయ విభాగ యోగము

అలా కాకుంటే జన్మ పరంపర కర్ధమే లేదు. ఆయా మానవుల ప్రవర్తనలో ఏర్పడుతున్న వైషమ్యానికీ వైవిధ్యానికీ అసలే అర్థం లేదు.

  అయితే ఇది ఇంతేనా మన జీవితం. దీనికేమైనా తరణోపాయమంటూ ఉందా అని అడిగితే చెబుతున్నారు సమాధానం భాష్యకారులు. వినండి. ఆయన ఈ వ్యాధి మనకెలా సంక్రమించిందో దాని లక్షణాలూ చెబుతారు. దాని నుంచి తప్పించుకొని బయటపడే చికిత్సా విధానమూ సెలవిస్తారు. జాగ్రత్తగా వినాలి మనం. పురుషస్య ప్రకృతిస్థత్వ రూపేణ మిధ్యాజ్ఞానేన యుక్తస్య భోగ్యేషు గుణేషు సుఖదుఃఖ మోహాత్మకేషు సుఖీ దుఃఖీ మూఢః అహ మస్మీతి ఏవం రూపోయస్సంగః తత్కారణం పురుషస్య సదసద్యోని జన్మ ప్రాప్తి లక్షణస్య సంసారస్య ఇతి సమాసేన పూర్వాధ్యాయే యదుక్తం. మానవుడనే వాడు వస్తుతః మంచివాడే. పరిశుద్ధుడే వాడికే కల్మషమూ లేదు. కాని ఉన్నట్టుండి ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతితో మమేకమయి పోయి తన స్వరూపాన్ని తాను మరచి పోయాడు. అదే మిధ్యా జ్ఞానం. అదే తన స్వభావ మనుకొనే సరికి సుఖ దుఃఖ మోహాత్మకమైన ప్రకృతి గుణాలు తనకు భోగ్యమనుకొని దాని కనుగుణంగా నేనే సుఖిని నేనే దుఃఖిని నేనే మూఢుడనని వాటితో పూర్తిగా సాంగత్యం పెట్టుకొంటూ వచ్చాడు. ఇదుగో ఈ గుణ సంపర్కమే వాడికీ సదసద్యోని జన్మలు ప్రాప్తించటానికి కారణమయింది. ఇదీ ఇంతకు ముందు గడచిన క్షేత్రజ్ఞాధ్యాయంలో సంగ్రహంగా శాస్త్రం మనకు వర్ణించిన విషయం.

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు