సుమా. అవి ఇంతకు పూర్వ జన్మనెలా నడుపుతూ వచ్చాయో అలాగే ఇప్పుడీ జన్మను కూడా నడుపుతున్నాయి. ఇది కేవలం సిద్ధాంతమనే గాదు. బాగా ఆలోచిస్తే దృష్టాంతం కూడా. మనకు తార్కాణమయ్యే విషయమే. చూడండి. లోకంలో కొందరెంతో స్తిమితంగా ఉంటారు. దేనిమీద నైనా బుద్ధి కేంద్రీకరించి చక్కగా ఆలోచించగలరు. చేయగలరు. తొందర పడరు. ఏ రంగంలోనైనా చూడవచ్చునది. గొప్ప వైద్యులేమిటి. జ్యోతిషికు లేమిటి. శాస్త్రజ్ఞులేమిటి. అధ్యాపకులేమిటి. ఇలాగే కనిపిస్తుంటారు మనకు అంతేకాదు. జన్మతః వస్తుంది కొందరికొక విద్య. అది వారు ప్రయత్నపూర్వకంగా అభ్యసించింది కాదు. అది వారికొక లేశమాత్రంగా అబ్బితే చాలు. దాని నభివృద్ధి చేసుకోవాలని తరువాత దానిలోనే కృషి చేస్తూపోతారు. ఒక సంగీతమేమిటి. సాహిత్యమేమిటి. చిత్రలేఖన మేమిటి. అన్నీ ఇంతే. వారి కాయా విషయాలలో ఉన్న శ్రద్ధాభక్తులు చూస్తే మనకర్ధ మవుతుంది ఇదంతా సత్త్వగుణ ప్రభావమని.
పోతే మరికొందరు చూడండి. ఎప్పుడూ పాదరసంలాగా పరుగెత్తి పోతుంటారు. మనసెప్పుడూ పరిపరి విధాల చెదిరిపోతుంది. ఆందోళన చెందుతుంటుంది. ఒకదాని మీద గట్టిగా నిలబడదు. అన్నింటిలో వేలు పెట్టటమే గాని ఎందులోనూ పరిపూర్ణత లేదు. పెద్ద పదవులు