మానవుడు. స్తిమితంగా ఒక్క క్షణముండలేడు. ఒకటి ఫలిస్తే సంతోషం. లేకుంటే విషాదం. అది పోగొట్టుకొని మళ్లీ దాన్ని సానుకూలం చేసుకోటానికి ప్రయాస. ఇలా ఒక దానికొకటి తోడయి అనుక్షణమూ నిన్ను దుఃఖ సాగరంలో ముంచేదే రాజసమైన జీవితం.
పోతే కడపటిది తమస్సు. అది మరీ అన్యాయం. అజ్ఞానం తమసః ఫలం. అయోమయస్థితి తమస్సంటే. సత్త్వం లాగా ప్రకాశం లేదు. రజస్సులాగా చలాకీ లేదు. మొద్దులాగా పడి ఉండటమే దాని లక్షణం. అదే అజ్ఞానమంటే. జడపదార్ధా లెలాంటివో అలాంటిదే మానవుడి జీవితం కూడా. మరి దాని ఫలితం కూడా అజ్ఞానం కాక జ్ఞానమెలా కాగలదు. అజ్ఞాన మన్నప్పుడది జీవితమంతా గాఢాంధకారం. అందులో దారీ తెన్నూ ఏదీ గోచరం కాదు. ఎక్కడున్న వాడక్కడే. ముందుకు పోయే ప్రయత్నం లేదు. ప్రయత్నమే లేకుంటే ఫలితం లేదు. అయితే సాత్త్వకుడు మంచి ధర్మకార్యాలు చేస్తుంటాడు. రాజసుడు అధర్మకార్యాలు చేసి దుఃఖఫల మనుభవిస్తాడు. మరి తామసుడు ధర్మాధర్మాలకు రెంటికీ స్వస్తి చెప్పి పశుప్రాయంగా బ్రతికి పాశవమైన జన్మ ఎత్తినా ఆశ్చర్యం లేదు.
సత్త్వాత్సం జాయతే జ్ఞానం - రజసోలోభ ఏవచ
ప్రమాద మోహౌ తమసః - భవతో 2 జ్ఞానమేవచ - 17
ఇంకా ఈ గుణాల ప్రభావమెలాంటిదో పూసగుచ్చినట్టు పేర్కొంటున్నాడు. సత్త్వగుణం బాగా వృద్ధి చెందితే మానవుడికి జ్ఞానమనేది