#


Index

గుణత్రయ విభాగ యోగము

అన్నారు. మరి వాడి మూఢత్వానికి తగిన మూఢజన్మే వస్తుంది వాడికి పశుపక్ష్యాదులే గదా మూఢమైనవి. మూఢత్వమంటే ఇది మంచి ఇది చెడ్డ అనే వివేకం లేకపోవటం. అలాంటి వివేక జ్ఞానమే మాత్రమూ లేని పశుపక్ష్యాది జాతులలోనే జన్మించక తప్పదీ మానవుడు. మానవజన్మ ఎత్తి కూడా ఎప్పుడు దానికి తగిన బుద్ధిబలం జ్ఞానం లేకుండా జీవించాడో అదే చివరకు వీడికి ప్రాప్తం. అలా జీవించి మరలా జన్మించినవే నన్న మాట ఇప్పుడు మనం చూచే ఈ పశుపక్ష్యాది జీవులన్నీ.

కర్మణ స్సుకృత స్యాహు - స్సాత్త్వికం నిర్మలం ఫలం
రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలమ్ - 16

ముందు చెప్పి శ్లోకార్ధాన్నే సంగ్రహంగా చెబుతున్నాడు మరలా ఇప్పుడీ శ్లోకంలో మహర్షి అక్కడ విడివిడిగా పేర్కొన్నవిక్కడ మూడు గుణాలనూ కలిపి వర్ణిస్తున్నాడు. కర్మణ స్సు కృతస్య. సుకృతమంటే ఇక్కడ సత్త్వగుణ సంబంధి అని అర్థం చెబుతారు భాష్యకారులు. సాత్త్వికమైన కర్మ చేస్తూ పోతే దానికి కలిగే ఫలం సాత్త్వికమేనట. అంటే ఫలితం నిర్మలంగా శుద్ధంగా ఉంటుంది. దుఃఖంతో మిశ్రితంగాని సుఖానుభవమే కలుగుతుంది తరుచుగా. పోతే రజసస్తు ఫలం దుఃఖం. రజోగుణ ఫల మలాంటిది గాదు. దానికి దుఃఖమే ఫలం. ఎంచేత. రజస్సంటేనే చలనాత్మకమైన గుణం. దానితో ఎప్పుడూ లోక వ్యవహారాలలో మునిగి తేలుతుంటాడు

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు