ధర్మపన్నాలన్నీ వర్ణించి చెప్పారు. చివరకిద్దరూ యోగ మార్గంలో ప్రాణశక్తిని పైకి లేపి సుషుమ్న ద్వారా నిష్క్రమణ చేశారు గూడా. అయినా వారికి మోక్షమనేది ప్రాప్తించినట్టు వేదవ్యాసు డెక్కడా వర్ణించలేదు. అలా వర్ణించకపోగా ఒకరు అష్టమ వసు సాయుజ్యం మరొకరు యమధర్మరాజు అంశ కాబట్టి ఆయనతోనే సాయుజ్యం చెందాడని మనకు బోధించాడు. ఇంతకూ భారతవీరుల కెవరికీ రాలేదు మోక్షం. అలాటి మహాఫలమందు కొన్నవాడు భారతంలో కాదు. భాగవతంలో కనపడతాడు మనకు. ఆయన గారే పరీక్షిత్తు. అర్జునుడి మనవడే అతడు. కాని అర్జునాదుల కెవరికీ అబ్బని భాగ్యమా మనవడికే దక్కిందంటే ఏమిటర్ధం. వారు మాటలు చెప్పారు విన్నారే గాని అవి వారికి మననం కాలేదు. నిదిధ్యాసన అంతకన్నా లేదు. ఇక సాక్షాత్కారమెలా అవుతుంది. జీవితంలోనే కాకుంటే జీవితానంతర మయ్యే ప్రసక్తి ఏముంది. పోతే పరీక్షిత్తు ఒకరికి చెప్పలేదు. చేయలేదు. కేవలం విన్నాడొక బ్రహ్మవేత్త దగ్గర. విన్నది ఒంట బట్టించుకొన్నాడు. పట్టించుకొన్నది గట్టిగా పట్టుకొని దాన్నే ధ్యానిస్తూ దాన్నే సర్వత్రా చూస్తూ తన స్వరూపంగా దర్శిస్తూ ఆ సర్వాత్మ భావంతో కన్ను మూశాడు.
కాబట్టి ఇంతకూ చెప్ప వచ్చే దేమంటే సత్త్వగుణ మున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. కర్మానుష్ఠాన యోగాభ్యాస భక్తి భావనల